‘ఆయనకా సామర్థ్యముంది’.. కేసీఆర్‌పై శివసేన ఎంపీ ప్రశంసలు

22 Feb, 2022 04:53 IST|Sakshi
ఇటీవలి ముంబై సమావేశంలో సంజయ్‌ రౌత్, తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే

ఎంతో కష్టించి పని చేస్తారు

ఆటుపోట్లెన్నో తట్టుకున్నారు

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌

నాగపూర్‌: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అందరినీ కలుపుకుని ఒక్కతాటిపై ముందుకు తీసుకెళ్లగలరని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఆ సామర్థ్యం ఆయనలో ఉందని అభిప్రాయపడ్డారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘కేసీఆర్‌ చాలా కష్టపడి పని చేసే నాయకుడు. రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అందరినీ కలుపుకుని ముందుకు నడపగల సామర్థ్యం కేసీఆర్‌లో పుష్కలంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.

కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు కోసం బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగడతానని కేసీఆర్‌ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఆ ప్రయత్నాల్లో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆహా్వనం మేరకు ఆదివారం ముంబై వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై, బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు. భావ సారూప్య పారీ్టలన్నింటితో మాట్లాడుతున్నామని, త్వరలో అంతా సమావేశమై భావి కార్యాచరణకు రూపమిస్తామని అనంతరం సీఎంలిద్దరూ ప్రకటించారు. అనంతరం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో కూడా కేసీఆర్‌ చర్చలు జరిపారు. దేశం కోసం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్టు వారిద్దరూ చెప్పారు.

పశి్చమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తదితరులతో కూడా కేసీఆర్‌ ఇటీవల ఫోన్‌లో చర్చలు జరపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ నాయకత్వ లక్షణాలను ప్రశంసిస్తూ రౌత్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశంలో రాజకీయ మార్పు ఆవశ్యకత తదితరాలపై ఆదివారం నాటి భేటీలో కేసీఆర్, ఠాక్రే లోతుగా చర్చించుకున్నారని రౌత్‌ వివరించారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రయత్నాలకు కొనసాగింపుగా మరికొందరు ప్రముఖ రాజకీయ నాయకులతో కలిసి వారు త్వరలో మరోసారి భేటీ అవుతారని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ ప్రక్రియను కేసీఆర్‌–ఠాక్రే భేటీ వేగవంతం చేస్తుందని శివసేన పత్రిక సామ్నా ఆదివారం అభిప్రాయపడింది.  

కాంగ్రెస్‌ లేకుండా కూటమి లేదు
కాంగ్రెస్‌ లేకుండా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు అసాధ్యమని సంజయ్‌ రౌత్‌ కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్‌ లేకుండా రాజకీయ కూటమి ఏర్పాటవుతుందని శివసేన ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పడాలని మమతా బెనర్జీ సూచించినప్పుడు కాంగ్రెస్‌ను కూడా అందులో భాగస్వామిని చేసుకోవాలన్న తొలి పార్టీ శివసేనే అని గుర్తు చేశారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ భాగస్వాములన్న విషయం తెలిసిందే. బీజేపీపై రౌత్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యం చేసుకోవడం దానికి అలవాటేనంటూ దుయ్యబట్టారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, ఆ పార్టీ నేతల ప్రకటనలే అందుకు రుజువని అన్నారు. 

మరిన్ని వార్తలు