బీజేపీ ఇవ్వనంటోంది! పారికర్‌ కొడుక్కి ఇతర పార్టీల నుంచి ఆఫర్లు..

17 Jan, 2022 17:08 IST|Sakshi

పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గోవా దివంగత సీఎం మనోహర్‌ పారికర్‌ తనయుడు ఉత్పల్ పారికర్ ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. అయితే పనాజీ అసెంబ్లీ స్థానం ఆయనకు కేటాయించే విషయంపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత  ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉత్పల్‌ పారికర్‌కు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. 

శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. ఉత్పల్‌ పారికర్‌ పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే (కాంగ్రెస్‌, ఆప్‌, తృణమూళ్‌)తో పాటు ప్రాంతీయ పార్టీ గోవా ఫార్వార్డ్‌ సైతం ఆయనకు మద్దతు ఇస్తాయని తెలిపారు. ఆయనకు పోటీగా అభ్యర్థిని కూడా నిలబెట్టవని పేర్కొన్నారు. ఇలా చేయడం మాజీ సీఎం మనోహర్‌ పారికర్‌కు నిజమైన నివాళి ఇవ్వడం అవుతుందని తెలిపారు.

మరోవైపు ఆప్‌ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ఉత్పల్‌ ఆప్‌లో చేరుతానంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అందరి చూపు పానాజీ అసెంబ్లీ స్థానంపై పడింది. అయితే దివంగత సీఎం కుమారుడికి బీజేపీ.. పనాజీ టికెట్‌ కేటాయిస్తుందా? లేదా? అని ఇప్పటికే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 

కేవలం మాజీ సీఎం తనయుడు లేదా మరో ఇతర నేతకు చెందిన వారైతే బీజేపీ టికెట్‌ ఇవ్వదని గోవా అసెంబ్లీ ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్‌ దేవేంద్ర ఫడ్నవిస్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ అధిష్టానం సైతం టికెట్‌ ఇవ్వలేమని సంకేతాలు పంపించింది.

మరిన్ని వార్తలు