వద్దని చెప్పినా శశిథరూర్‌ వినలేదు.. ఆయనతో చర్చకు ఒప్పుకోను

3 Oct, 2022 07:11 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో అందరి ఆమోదంతో ఒకే అభ్యర్థి ఉంటే బాగుంటుందని, ఎన్నిక ఏకగ్రీవం కావాలని అభిలషించానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో తన నివాసంలో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో ఖర్గే పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు. ‘సర్వామోదంతో, పోటీ లేకుండా ఒక్కరినే పార్టీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని నా ప్రతిపాదన. అదే విషయాన్ని శశిథరూర్‌కు చెప్పా. నాతో ఆయన విబేధించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నిక మంచిది అని థరూర్‌ వాదించారు. తానూ బరిలో దిగుతానని చెప్పారు’ అని ఖర్గే మీడియాకు వెల్లడించారు.

‘ఒక వేళ పార్టీ చీఫ్‌గా ఎన్నికైతే గాంధీల కుటుంబం ఇచ్చే అమూల్యమైన సలహాలను పరిగణనలోకి తీసుకుంటా. నేనేమీ గాంధీలు బలపరిచిన అధికారిక అభ్యర్థిని కాదు. ఇప్పుడు పార్టీలో జీ–23 అంటూ ఎలాంటి అసంతృప్త నేతల కూటమి లేదు. అందరం కాంగ్రెస్‌ నాయకులమే. ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీని సమష్టిగా ఎదుర్కొంటాం ’అని ఖర్గే స్పష్టంచేశారు.  ‘నేను పార్టీలో ఎవరిపైనో పోటీకి దిగలేదు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో భాగమే ఈ పోటీ. పార్టీలో సమూల మార్పులు ఉన్నపళాన జరగవు’ అని ఖర్గే అభిప్రాయపడ్డారు.

పార్టీపై గాంధీలు గుత్తాధిపత్యం చేస్తారనే బీజేపీ ఆరోపణను ఖర్గే తిప్పికొట్టారు. ‘కాంగ్రెస్‌లో ఎన్నికల ప్రాధికార వ్యవస్థ ఉంది. ఓటింగ్‌ హక్కులున్నాయి. బీజేపీలో అలాంటిదేమీ లేదు. బీజేపీలో ఎన్నికలు జరిగాయా? జేపీ నడ్డాను ఎన్నుకున్నదెవరు? ఆ పార్టీలో డెలిగేట్స్‌ ఎంతమంది?’ అని ఖర్గే ప్రశ్నించారు. థరూర్‌ బహిరంగ చర్చ ప్రతిపాదనను తిరస్కరించారు.
చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ

మరిన్ని వార్తలు