నాన్‌ స్టాప్‌గా చిన్నమ్మ రాజకీయం

25 Apr, 2021 05:01 IST|Sakshi

రాజకీయాలకు దూరం  

అన్నాడీఎంకేతో కొనసాగుతున్న వైరం 

కోర్టులో విచారణ దశలో శశికళ కేసు

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ రాజకీయాలకు రాంరాం చెప్పేశారు. అస్త్ర సన్యాసం తీసుకున్న తరువాత ఆధ్యాత్మిక పర్యటనలో మునిగిపోయారు. కానీ, అన్నాడీఎంకేపై న్యాయస్థానంలో ఆమె సాగిస్తున్న ఆధిపత్య పోరు కొనసాగడం ఆశ్చర్యకరం. జయలలిత జీవించి ఉన్నంత వరకు నీడలా ఆమె వెన్నంటి ఉండిన శశికళ ఆ తరువాత ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. అంతా జయను పోలినట్లుగా చీరకట్టు, నుదుటన బొట్టు, పాద నమస్కారాలు, ఆశీర్వచనాలతో ప్రారంభమైన చిన్నమ్మ వైభవం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునే వరకు సాగింది. జయ మరణించిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉండిన పన్నీర్‌సెల్వంను బలవంతంగా బాధ్యతల నుంచి తప్పించి సీఎం సీటును అధిరోహించడమే తరువాయి అనే స్థితిలో చిన్నమ్మ జైలు పాలయ్యారు.

కథ అడ్డం తిరగడంతో జైలు కెళ్లే ముందు తన ప్రియశిష్యుడైన ఎడపాడి పళనిస్వామిని తనకు బదులుగా శాసనసభాపక్ష నేత (సీఎం)ను చేశారు. అలాగే తన అన్న కుమారుడు టీటీవీ దినకరన్‌ను అన్నాడీఎంకే ఇన్‌చార్జ్‌గా నియమించారు. పార్టీ, ప్రభుత్వం రెండునూ పరోక్షంగా తన చెప్పుచేతుల్లో ఉన్నాయనే సంతృప్తితో జైలు జీవితం ప్రారంభించారు. అయితే, తన చేత బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయించిన శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వం అనతికాలంలోనే ఎడపాడితో చేతులు కలిపారు. ఇద్దరూ కలిసి టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి సాగనంపారు. శశికళ, దినకరన్‌లను బహిష్కరిస్తూ అన్నాడీఎంకే జనరల్‌ బాడీ సమావేశంలో తీర్మానాలు చేశారు. అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు శశికళ, దినకరన్‌ న్యాయస్థానంలో జరిపిన విఫలమైంది.

పార్టీ కోసం పట్టుబట్టి.. రాజకీయాలు విడిచిపెట్టి
ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష ముగించుకుని జైలు నుంచి విడుదలైన శశికళ అన్నాడీఎంకే తన చేతుల్లోకి వచ్చేస్తుందని ఆశించారు. అది జరగకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించి అన్నాడీఎంకేను దెబ్బతీయాలని నిర్ణయించుకున్నారు. అనేక రకాలుగా పావులు కదిపారు. అయితే అన్నాడీఎంకే–బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శశికళ అధికారికంగా ప్రకటించి అందరికీ షాకిచ్చారు. జయలలిత ఎంతగానే ప్రేమించిన అన్నాడీఎంకేను దెబ్బతీయడం, అమ్మ తీవ్రంగా ద్వేషించిన డీఎంకేకు సహకరించడమే అవుతుందనే ఆలోచనతో రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు శశికళ స్పష్టం చేశారు. అంతటితో ఆమె ఆగలేదు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న రోజుల్లో ఆధ్యాత్మిక బాటపట్టారు. రాష్ట్రంలోని ఆలయాలను సందర్శిస్తూ కాలం గడిపారు. 

కోర్టులో కొనసాగుతున్న పోరు: 
అయితే, రాజకీయ అస్త్రసన్యాసం తీసుకున్నా అన్నాడీఎంకేపై ఆమె పోరు కొనసాగిస్తూనే ఉండడం గమనార్హం. న్యాయస్థానం సాక్షిగా ఈ విషయాన్ని నమ్మక తప్పదు. ఆదాయానికి మించిన ఆస్తు కేసులో శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో 2017 సెప్టెంబర్‌ 12న అన్నాడీఎంకే జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ, నిర్వాహకునిగా టీటీవీ దినకరన్‌లను గత సమావేశంలో ఎన్నుకోవడం చెల్లదని పేర్కొంటూ తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శశికళ, దినకరన్‌ సదరు జనరల్‌ బాడీ సమావేశం చెల్లదని ప్రకటించాల్సిందిగా మద్రాసు సివిల్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. అంతేగాక ఆనాటి సమావేశంలో చేసిన 12 తీర్మానాలు చెల్లవని ప్రకటించాలని కోరారు. ఇదిలాఉండగా, తాను అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంను స్థాపించి పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున ఈ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు టీటీవీ దినకరన్‌ కోర్టుకు తెలిపాడు.

రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన శశికళ ఈ కేసును మాత్రం వెనక్కి తీసుకోలేదు. ఇదే సమయంలో శశికళ కేసును కొట్టి వేయాలని కోరుతూ అన్నాడీఎంకే తరఫున మరో పిటిషన్‌ దాఖలైంది. అన్నాడీఎంకే వేసిన పిటిషన్‌కు బదులివ్వాల్సిందిగా న్యాయస్థానం గత విచారణ సమయంలో శశికళను కోరింది. ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా, న్యాయమూర్తి సెలవుపై ఉన్నందున జూన్‌ 18వ తేదీకి వాయిదావేశారు. శశికళ వైఖరి ఏమిటో వాయిదా తేదీ విచారణ వరకు వేచిచూడాల్సిందే.   

మరిన్ని వార్తలు