Tamil Nadu: దినకరన్‌కు చిన్నమ్మ చెక్‌

24 Jul, 2021 06:47 IST|Sakshi

డీఎంకే, అన్నాడీఎంకేలోకి వలసల పర్యవసానం 

ఏఎంఎంకే బాధ్యత నుంచి తాత్కాలిక విరమణ 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో శశికళ

సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నేతలు డీఎంకే, అన్నాడీఎంకేల్లోకి వలసలు వెళ్లడాన్ని తీవ్రంగా పరిగణించిన శశికళ, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి టీటీవీ దినకరన్‌ను తాత్కాలికంగా పక్కనపెట్టారు. బంధువుల నుంచి ప్రత్యామ్నాయ నేతను సిద్ధం చేస్తున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రిగా ఉండిన జయలలిత మృతి తరువాత శశికళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మారి తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. జయ మరణం సమయంలో సీఎంగా ఉండిన పన్నీర్‌సెల్వం చేత బలవంతంగా రాజీనామా చేయించి శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు.

సీఎంగా పదవీ ప్రమాణం చేసేందుకు గవర్నర్‌ ఆమోదం పొందేందుకు సమాయత్తం అవుతున్న తరుణంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలయ్యారు. తనకు బదులు ఎడపాడి పళనిస్వామిని సీఎంగా చేసి పార్టీ బాధ్యతలు టీటీవీ దినకరన్‌కు అప్పగించారు. అయితే పార్టీని వీడిన పన్నీర్‌సెల్వం, ఎడపాడి ఏకమై దినకరన్, శశికళను పార్టీ నుంచి బహిష్కరించడంతో అగ్గిరాసుకుంది. 37 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను దినకరన్‌ తనవైపునకు తిప్పుకున్నారు. అన్నాడీఎంకేకు పోటీగా దినకరన్‌ ఏఎంఎంకేను స్థాపించగా వీరిలో 18 మంది మాత్రమే దినకరన్‌ను అనుసరించి పార్టీ ఫిరాయింపు చట్టం కింద పదవిని కోల్పోయారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయవద్దు, ఉప ఎన్నికల్లో మాత్రమే పోటీచేయండని జైలు నుంచి శశికళ ఆదేశించారు.

అయితే ఆమె ఆదేశాలను ధిక్కరించి తమిళనాడు, పాండిచ్చేరీల్లో పార్లమెంటు ఎన్నికల బరిలో దిగి మొత్తం 40 స్థానాల్లో ఏఎంఎంకే అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఆ తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ ఘోరపరాజయం పొందారు. తన మాట పెడచెవిన పెట్టిన ఫలితంగా అవమానాలపాలు కావాల్సి వచ్చిందని దినకరన్‌పై శశికళ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అవే దుష్పలితాలు పునరావృతం కావడంతో ఏఎంఎంకే శ్రేణులు పార్టీని వీడి అధికార డీఎంకే, ప్రధాన ప్రతిపక్ష అన్నాడీఎంకేలో చేరడం ప్రారంభించారు. ముఖ్యనేతలంతా తమదారి చూసుకోవడంతో ఏఎంఎంకే గుడారం ఖాళీ అయ్యేదశకు చేరుకుంది.

దినకరన్‌ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే పార్టీ పతనం దిశగా పయనిస్తోందని కొందరు నేతలు శశికళకు ఫిర్యాదు చేయడంతో ఆమె మరింతగా మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ ఉనికికే ముప్పువాటిల్లగలదని ఆందోళన చెందిన శశికళ ఇటీవల దినకరన్‌తో ఫోన్‌ ద్వారా సంభాషించినట్లు సమాచారం. “పార్టీని నేను చూసుకుంటాను, కొంతకాలం బాధ్యతల నుంచి తప్పుకో’ అని ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేగాక పార్టీ కార్యకలాపాలకు అన్న కుమారుడు, భర్త సోదరుడిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో దినకరన్‌ రాజకీయ ప్రకటనలు చేయడం, చెన్నై రాయపేటలోని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, కార్యాలయానికి రావడం మానివేశారు. పార్టీ శ్రేణులను కలుసుకోవడం కూడా మానేశారు.

మరిన్ని వార్తలు