అది మసాజ్ కాదు.. ట్రీట్‌మెంట్‌.. జైలు వీడియోపై ఆప్‌ కౌంటర్‌..

19 Nov, 2022 14:57 IST|Sakshi

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ మంత్రి సత్యేందర్‌ జైన్ తిహార్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోను రిలీజ్ చేసిన బీజేపీ కేజ్రీవాల్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే ఆప్ దీనికి కౌంటర్ ఇచ్చింది.

సత్యేందర్ జైన్‌ చేయించుకుంది మసాజ్ కాదని, ట్రీట్‌మెంట్‌అని వివరణ ఇచ్చింది. జైలులో ఉన్న ఆయన 4 నెలలుగా ఆహారం తీసుకోలేదని, కేవలం పండ్లు మాత్రమే తింటున్నారని తెలిపింది. ఈ కారణంగానే ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స అందించాలని కోర్టు ఆదేశించిందని చెప్పింది. సత్యేందర్ జైన్ నరాల సమస్యతో బాధుపడుతున్నారని, ఆక్సీజన్ తీసుకోలేక ఇబ్బందిపడుతున్నారని పేర్కొంది. అందుకే ఆక్యుప్రెషర్ థెరపీ ద్వారా చికిత్స అందించినట్లు చెప్పుకొచ్చింది.

సత్యేందర్ జైన్ రోజు గుడికి వెళ్లకుండా ఆహారం తీసుకోరని, జైలులో ఉన్న కారణంగా పండ్లపైనే ఆదారపడ్డారని ఆప్ వివరించింది. ఆయనకు చేసింది మసాజ్ కాదని, థెరపీ అని స్పష్టం చేసింది.

రూ.16 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సత్యేంజర్ జైన్‌ను మే 30న అరెస్టు చేశారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. బెయిల్ కోసం రెండుసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ నిరాశే ఎదురైంది.

అయితే బీజేపీ విడుదల చేసిన సత్యేందర్ జైన్ మసాజ్ వీడియో పాతదని, ఇప్పటికే ఈ ఘటనతో సంబంధం ఉన్న జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.
చదవండి: ఆప్‌ మంత్రికి తీహార్‌ జైల్లో మసాజ్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు