వీడని నీడలు!

12 Apr, 2021 08:56 IST|Sakshi

పరస్పర విమర్శలకు దూరంగా బాబు– పవన్‌ 

ప్రచార సభల్లో బహిర్గతమైన సంబంధం

కమలనాథుల సాక్షిగానే అనుబంధం 

చంద్రుడి వైపే పవనం సాగుతోందా..? టీడీపీ– జనసేన మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందా..? రెండు పార్టీల నడుమ గాఢానుబంధం కొనసాగుతోందా..? ఇరువురు నేతలూ స్వలాభం కోసం ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తారా..? వ్యక్తిగత ప్రయోజనాల కోసం విలువలను గాలికి వదిలేస్తారా..? ఓట్ల కోసం రాష్ట్రాభివృద్ధినే తాకట్టుపెడతారా..? నాటి మాటలన్నీ నీటిమూటలేనా..? కమలనాథులకు తెలిసే తంతు జరుగుతోందా..? ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎంతకైనా తెగిస్తారా..? శ్రీకాళహస్తిలో బాబు ప్రసంగం వింటే అవుననే అనిపిస్తుంది.. తిరుపతిలో పవన్‌కల్యాణ్‌ ఉపన్యాసాన్ని ఆలకిస్తే లోగుట్టు అర్థమవుతుంది.

సాక్షి, తిరుపతి: టీడీపీ– జనసేన అధినేతల వ్యవహారశైలి అనుమానాస్పదంగా తయారైంది. మొన్న తిరుపతిలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగంలో చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు. నిన్న శ్రీకాళహస్తిలో ప్రచారం చేసిన ‘నారా’ వారు   జనసేన అధినేతపై నోరెత్తలేదు. ఇరువురు నేతలూ కేవలం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు గుప్పించేందుకే పరిమితమయ్యారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ– జనసేన పొత్తు కుదుర్చుకుని ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. లెక్కప్రకారమైతే వారికి వైఎస్సార్‌సీపీ ఎంతో టీడీపీ కూడా అంతే కావాలి. ఇందుకు విరుద్ధంగా కేవలం అధికార పార్టీపైనే విమర్శలు కురిపించడంపై  ప్రజలు విస్తుబోతున్నారు. ముఖ్యంగా టీడీపీ– జనసేన లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు  
సార్వత్రిక ఎన్నికల నుంచి టీడీపీ, జనసేన ఏమాత్రం గుణపాఠం నేర్చుకోలేదు. కుయుక్తులను ప్రజలు హర్షించరనే వాస్తవాన్ని గ్రహించలేదు. పాత పంథాలో కుట్ర రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా బాబు, పవన్‌ ప్రచార సభలే  నిలుస్తాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోదీ తిరుపతిలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చినప్పుడు ఈ ఇద్దరు పెద్దమనుషులు ఆ వేదికపైనే ఉన్నారని, కానీ, ప్రస్తుతం ఇరువురూ తమ ప్రసంగాల్లో ఆ ఊసే ఎత్తలేదని ఆరోపిస్తున్నారు. చీకటి ఒప్పందాలతో ముందుకు వస్తున్న విపక్ష పార్టీలకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారని విశ్లేషిస్తున్నారు. ఉప ఎన్నికలో ఘోర ఓటమి తప్పదని రాజకీయ పండితులు పేర్కొన్నారు.
చదవండి:
జనసేనకు షాక్‌! మాదాసు గంగాధరం రాజీనామా
పాచిపోయిన లడ్డూలు పవన్‌‌కు రుచిగా ఉన్నాయా? 

మరిన్ని వార్తలు