ఆ జీవోపై పవన్‌కు అవగాహన లేదు

21 Feb, 2022 04:17 IST|Sakshi
మంత్రి అప్పలరాజు , ఎంపీ మోపిదేవి

నిజానికి 217 జీవోతో మత్స్యకారులకు లాభం 

మత్స్యకారుల సమస్యల గురించి పవన్‌కేం తెలుసు? 

సినిమా ప్రీ రిలీజ్‌ ప్రమోషనే ఆయన మత్స్యకార సభ 

చంద్రబాబు స్క్రిప్టు చదువుతూ మభ్యపెడుతున్నారు 

మంత్రి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి

కాశీబుగ్గ/రేపల్లె రూరల్‌:  జీవో 217 వల్ల మత్స్యకారులకు మరింత లాభం కలుగుతుందని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. జీవో 217కు, సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఎటువంటి సంబంధం లేదన్న విషయం కూడా తెలియని అజ్ఞాని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అని ధ్వజమెత్తారు. ఈ జీవోను ఎందుకు తప్పుపడుతున్నారో, దానివల్ల మత్స్యకారులకు జరిగే నష్టం ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నరసాపురంలో జరిగింది మత్స్యకార సభ కాదని, సినిమా ప్రీ రిలీజ్‌ ప్రమోషన్‌ మాత్రమేనని ఎద్దేవా చేశారు. మత్స్యకారుల సమస్యలపై అవగాహనలేని పవన్‌సినిమా స్క్రిప్టులు, చంద్రబాబు స్క్రిప్టు చదువుతూ మభ్యపెడుతున్నారని చెప్పారు.

మంత్రి శ్రీకాకుళం జిల్లా పలాసలోను, ఎంపీ గుంటూరు జిల్లా రేపల్లెలోను ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇంతకుముందు ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ బాడీస్‌లో మత్స్యకారుల పేరుచెప్పి అధికారపార్టీ దోపిడీ చేసేదని, వారికి రూపాయి కూడా దక్కేది కాదని చెప్పారు. మత్స్యకారుల నోటికాడ తిండిని పెట్టుబడిదారులు, దళారులు కొట్టేసి ఏడాదికి రూ.300, రూ.వెయ్యి చేతిలో పెట్టేవారన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపి మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు, మత్స్యకార సొసైటీలో ప్రతి సభ్యుడికి రూ.15 వేల వరకు ఆదాయం వచ్చేలా చూసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 217 జీవో తీసుకొచ్చారని చెప్పారు.

ఈ జీవోను పైలట్‌ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లాలో అమలు చేస్తున్నామని, 27 రిజర్వాయర్లలో బహిరంగ వేలానికి వెళ్లామని తెలిపారు. వాస్తవంగా తీరప్రాంత గ్రామాల్లో చిన్నచిన్న చెరువులు మాత్రమే సొసైటీల పరిధిలోకి వస్తున్నాయని, వేల ఎకరాల చెరువులు, ట్యాంక్‌లు సొసైటీల పరిధిలో ఉండటం లేదని చెప్పారు. దీంతో వాటిపై వచ్చే ఆదాయం దళారీ వ్యవస్థకే చెందుతోందన్నారు. ఈ వ్యవస్థను రూపుమాపి ఆ ఫలసాయాన్ని సొసైటీల ద్వారా మత్స్యకారులకు అందించేందుకు ఈ జీవో ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. దీనిపై అవగాహనలేని పవన్‌కల్యాణ్‌ ఆ జీవోను చించేశానంటున్నాడని ఎద్దేవా చేశారు.  

అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల బతుకులు మార్చేందుకు చేపల అవుట్‌ లెట్‌లతో విక్రయాలు చేయడానికి ప్రయత్నిస్తుంటే వాటిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మత్స్యకారులకు మేలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయడం తగదన్నారు. ఊరి చివర ఈగల మధ్యలో విక్రయాలు చేసే అవస్థ రాకుండా మత్స్యకార యువకులకు శిక్షణ ఇచ్చి, సబ్సిడీ రుణాలు అందించి అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేస్తున్నారన్నారు.

యువకులకు ఉపాధి కల్పిస్తుంటే ప్రభుత్వం చేపలు అమ్ముతోందని ఎద్దేవా చేయడం సబబు కాదన్నారు. ఇలా మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించే వారెవరైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు. మత్స్యకారుల సమస్యల గురించి అప్పట్లో చంద్రబాబుకు విన్నవిస్తే.. తొక్కతీస్తామన్నారని, ఆ సమయంలో పవన్‌ స్పందించలేదని గుర్తుచేశారు. పవన్‌ అవగాహన లేకుండా 215, 217 జీవోలపై జెట్టి, గంగమ్మ పూజలు, ఫిషింగ్‌ హార్బర్‌ అంటూ చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మత్స్యకారులు మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు.  

మరిన్ని వార్తలు