సహకార డెయిరీలను ముంచేసి హెరిటేజ్‌కు ధనార్జన

5 Dec, 2020 04:08 IST|Sakshi

హెరిటేజ్‌కు ఏటా రూ.1,277.5 కోట్ల లాభం

ఇదీ చంద్రబాబు ప్రభుత్వం కుట్ర

శాసనసభలో మంత్రి సీదిరి అప్పలరాజు 

సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో సహకారరంగాన్ని కుట్రతో నాశనం చేసి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ డెయిరీ అడ్డగోలు దోపిడీకి మార్గం సుగమం చేశారని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. తద్వారా హెరిటేజ్‌ డెయిరీకి ఏకంగా ఏడాదికి రూ.1,277.5 కోట్ల లాభం వస్తోందని, ఈ మేరకు దశాబ్దాలుగా దోపిడీకి పాల్పడ్డారని ఆయన గణాంకాలతోసహా వివరించారు. రాష్ట్రంలో పాడిపరిశ్రమ – అమూల్‌ ప్రాజెక్ట్‌ అనే అంశంపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ ప్రైవేటు డెయిరీలు లీటరుకు రూ.35 చొప్పున లాభం ఆర్జిస్తున్నాయని చెప్పారు. ఆ ప్రకారం రోజుకు 10 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్న హెరిటేజ్‌ ఏడాదికి రూ.1,277.5 కోట్లు చొప్పున ఎన్నో ఏళ్లుగా ఆర్జిస్తోందని వివరించారు. రాష్ట్రంలో రోజుకు 412 లక్షల లీటర్ల పాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అందులో ప్రైవేటు డెయిరీలు 69 లక్షల లీటర్లే సేకరిస్తున్నాయని, 123 లక్షల లీటర్లు గృహ వినియోగం అవుతున్నాయని, మరో 220 లక్షల లీటర్ల పాలు అసంఘటిత రంగంలోకి వెళ్లిపోతున్నాయని వివరించారు.  

పాడి రైతులను దోచుకున్న చంద్రబాబు
వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో పాడి పశువుల కొనుగోలుకు బ్యాంకు రుణాలు తీసుకునే రైతులు కచ్చితంగా హెరిటేజ్‌ డెయిరీకే పాలను సరఫరా చేయాలని షరతు విధించడం చంద్రబాబు దుర్మార్గానికి నిదర్శనమని చెప్పారు. ఇవన్నీ బయటపడతాయనే చంద్రబాబు శాసనసభలో లేకుండా వెళ్లిపోయారని చెప్పారు. 

సంగం డెయిరీ అక్రమాలపై విచారణ జరిపించాలి
గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య మాట్లాడుతూ సంగం డెయిరీలో అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు. సంగం డెయిరీ ఆస్తులను కొల్లగొట్టడానికి టీడీపీ నేతలు కుట్రపన్నారని ఆరోపించారు.   

మరిన్ని వార్తలు