చంద్రబాబు.. రాష్ట్రం పాలిట శకుని 

13 Oct, 2021 04:11 IST|Sakshi

డ్వాక్రా మహిళలను ఆయన మోసం చేశారు 

హామీలను గాలికొదిలేసిన బాబు సీఎం జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదం 

స్టేలతో ఆయన రాక్షసానందం పొందుతున్నారు 

మహిళలను ఇబ్బంది పెట్టిన నాయకుడు బాగుపడలేదు 

టీడీపీ అధినేతపై మంత్రి సీదిరి అప్పలరాజు మండిపాటు 

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): ఆంధ్రప్రదేశ్ పాలిట చంద్రబాబు శకునిలా మారారని పశుసంవర్థక, మశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. మహాభారతంలోని విలనిజం నుంచి బాబు స్ఫూర్తి పొందారేమోనని అనుమానం వ్యక్తంచేశారు. శ్రీకాకుళం నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌ ఆసరా రెండో విడత కార్యక్రమంవల్ల రాష్ట్రంలో ఎంతోమంది మహిళలకు ఆర్థికంగా చేయూత అందుతుంటే వాటిని ప్రతిపక్ష నేత తప్పుబట్టే ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు.

డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసగించడంతో.. తన పాదయాత్రలో మహిళలు కోరిన మీదట సీఎం వైఎస్‌ జగన్‌ ఆ రుణాలను మాఫీ చేస్తున్నాన్నారు. ఇందులో భాగంగానే మహిళల ఖాతాల్లో సొమ్ము జమచేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాని చంద్రబాబు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2014 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను విస్మరించిన చంద్రబాబు.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్న వైఎస్‌ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  

అన్నింటినీ అడ్డుకోవడం సిగ్గుగా లేదా బాబూ!? 
మహిళల హక్కులను, సంక్షేమాన్ని, అభివృద్ధిని కోర్టుల ద్వారా అడ్డుకోవడం చంద్రబాబుకి సిగ్గుగా అనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, ఇంగ్లిష్‌ మీడియం ఇలా అన్నింటినీ అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. పేదలందరికీ ఇళ్లు అందిస్తుంటే.. కోర్టుల్లో స్టేలు తెచ్చి బాబు అండ్‌ కో రాక్షసానందం పొందుతున్నారన్నారు. పైగా వైఎస్సార్‌సీపీ వారే కేసులు వేశారని వితండవాదం చేస్తున్న బాబుకు సిగ్గు, శరం ఉన్నాయా? అని మంత్రి ప్రశ్నించారు.

మహిళలను ఇబ్బంది పెట్టిన నాయకుడు ఎవరూ చరిత్రలో బాగుపడలేదన్నారు. కుట్రలతో కుతంత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టించి మహిళల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే చంద్రబాబుకు మళ్లీ జనం బుద్ధిచెబుతారని సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. మహిళలను అవమానించిన వారిని ప్రజలు అథఃపాతాళంలోకి తొక్కివేశారనడానికి బాబే ఉదాహరణ అని అన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు