రేవంత్‌కు షాక్‌.. టీపీసీసీ చీఫ్‌గా సీనియర్‌ నేత!

5 Jan, 2021 11:00 IST|Sakshi

ప్రచార కమిటీ చైర్మన్‌గా రేవంత్‌ రెడ్డి?

ఖరారు చేసిన అధిష్టానం.. నేడే ప్రకటించే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కొత్త బాస్‌ ఎవరన్న విషయం రాష్ట్ర రాజకీయాల్లో గతకొంత కాలంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తొలుత అనేకమంది సీనియర్‌ నేతల పేర్లు వినిపించినప్పటికీ.. చివరికి ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపిందని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు మెరుపు వేగంతో దూసుకువచ్చిన బీజేపీని ధీటుగా ఎదుర్కొనే సత్తా రేవంత్‌కు మాత్రమే ఉందని, పీసీసీ చీఫ్‌ పదవి ఆయనే దక్కుతుందని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ సీనియర్‌ నేతగా గుర్తింపు పొందిన కోమటిరెడ్డినే ఆ అవకాశం వరిస్తుందని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (కాంగ్రెస్‌ ఓటమి.. రేవంత్‌ వర్గంలో ఆశలు)

అనుభవజ్ఞుడికి అప్పగింతలు..
తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పీసీసీ పదవి రేవంత్‌కే దక్కుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి మొదటి వారంలోనే అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు కూడా వచ్చాయి. అయితే టీపీసీసీ చీఫ్‌ పదవిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న తరుణంలో అనూహ్యంగా మరో కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరును కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సీనియర్‌ నేతగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా పార్టీకి ఎంతోకాలంగా సేవలందిస్తున్న జీవన్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆరు సార్లు (జగిత్యాల) ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌ కుమార్‌చేతిలో అనుహ్య ఓటమి పొందారు. అనంతరం జరిగిన పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన మండలికి ఎన్నికయ్యారు. 1981లో రాజకీయ ప్రవేశం చేసిన జీవన్‌ రెడ్డికి అనుభవజ్ఞుడైన నేతగా, మృదుస్వభావి మంచి పేరుంది. అందరితో కలుపుకునిపోయే తత్వంగల నేతకావడంతో పీసీసీ పదవికి ఆయన్ని నామినేట్‌ చేసినట్లు తెలుస్తోంది. (రేవంత్‌కు పీసీసీ..  ఓ వర్గం డిమాండ్!)


రేవంత్‌పై టీడీపీ ముద్ర..
ఆంధ్రప్రదేశ్‌ విభజనతో తెలంగాణలో చావుదెబ్బ తిన్న టీడీపీలో కీలక నేతగా గుర్తింపు పొందిన రేవంత్‌రెడ్డి.. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందారు. తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచి తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. కొద్దికాలంలోనే పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే అప్పటి  పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాలు తప్ప ఒరిగింది ఏమీ లేదు. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హస్తం పార్టీ అంతులేకుండా పోయింది. పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్‌ పీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఇక తదుపరి అవకాశం తనకే దక్కుతుందని ఊహించిన రేవంత్‌కు అధిష్టానం మొండి చేయి చూపింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీ హనుమంతరావుతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన చాలామంది సీనియర్లు రేవంత్‌ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి పదవి ఎలా అప్పగిస్తారని బహిరంగంగానే విమర్శించారు. (రేవంత్‌రెడ్డిని మాత్రం కానివ్వను..)

రేవంత్‌కు ఊహించని షాక్‌..
అంతేకాకుండా రేవంత్‌కు పదవీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి రాజీనామా చేస్తామని అధిష్టానానికి హెచ్చరికలు సైతం పంపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ బాధ్యుడు మాణికం ఠాగూర్‌ను అధిష్టానం రంగంలోకి దించింది. కొత్త సంవత్సరం లోపు నూతన  పీసీసీ చీఫ్‌ ఎంపికను పూర్తి చేయాలని గడువు విధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్‌ నేతలు, కార్యకర్తలు, ముఖ్య నేతలతో అభిప్రాయాన్ని స్వీకరించిన మాణికం అధిష్టానానికి తుది నివేదికను అందించారు. అనంతరం పార్టీ పెద్దలు సైతం పలువురు నేతల్ని ఢిల్లీకి పిలిపించుకుని వ్యక్తిగత అభిప్రాయం సైతం తీసుకుంది. రేవంత్‌, కోమటిరెడ్డి ఇద్దరిలో ఏ ఒక్కరికి పీసీసీ దక్కకపోయినా ఊహించని పరిణామాలు ఎదుర్కొక తప్పదని భావించిన అధిష్టానం వీరిద్దరికి వేరే బాధ్యతలు అప్పగించి.. మరో సీనియర్‌ నేతకు పీసీసీ పదవిని అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అందరి పేర్లును పరిశీలించగా.. రాజకీయాలతో పాటు వ్యక్తిగతంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన జీవన్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రేవంత్‌ వర్గీయులు ఏమాత్రం ఊహించనిది.

మరోవైపు రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్‌గా రేవంత్‌ రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా మరో నాలుగు కీలక కమిటీలకు ముఖ్య నేతలను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. అయితే దీనిపై తుది ప్రకటన వెలువడాల్సి ఉంది. పీసీసీతో పాటు నాలుగు కమిటీల పేర్లును ఇప్పటికే అధిష్టానం పైనల్‌ చేసిందని షీల్డ్‌ కవర్‌లో పేర్లును ఉంచినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ‍ప్రకారం మంగళవారం లేదా బుధవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిపై ఇంకా కసరత్తు సాగుతున్నట్లు సమాచారం. కొత్త కమిటీలో ఎమ్మెల్యే సీతక్కతో పాటు, షబ్బీర్‌ అలీ, కోమటిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు