'సీనియర్ నాయకున్ని.. చేతులు జోడించి ఓట్లు అడగాలా..?'

27 Sep, 2023 15:15 IST|Sakshi

ఇండోర్‌: లిస్టులో పేరు లేకపోతే విచారం వ్యక్తం చేసిన అభ్యర్థులను చూశాం. కానీ లిస్టులో పేరు ఉన్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గీయ. మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో నిలబడటానికి అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో జాతీయ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గీయ పేరు ఉంది. ఇండోర్ అసెంబ్లీ సీటు-1 నుంచి ఆయన బరిలో దిగారు. 

లిస్టులో తనపేరును చూసి షాక్‌కు గురైనట్లు ఎన్నికల ర్యాలీలో విజయవర్గీయ తెలిపారు. పోటీ చేయాలని తనకు ఎలాంటి కోరిక లేదని చెప్పారు. "నాకు ఏమాత్రం సంతోషంగా లేదు. సీనియర్ లీడర్‌గా కేవలం మీటింగ్‌లలో మాత్రమే మాట్లాడి వెళ్లగలను. పోటీ చేయడానికి ఓ మైండ్‌సెట్ అవసరమవుతుంది. సీనియర్ లీడర్‌గా చేతులు జోడించి ఇప్పుడు మిమ్మల్ని ఓట్లు అడగాలా..?' అంటూ విజయవర్గీయ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. 

'పబ్లిక్ మీటింగ్స్‌కు ప్రణాళికలు చేసుకున్నాను. ఐదు సమావేశాలకు హెలికాఫ్టర్‌లో వెళ్లాలి. మూడింటికి కారులో వెళ్లాలి. కానీ మనం అనుకున్నది కొన్నిసార్లు కాదు. దేవుడి నిర్ణయమే నడుస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉన్నట్లుంది. నా శక్తి కొద్ది ఈ బాధ్యతకు న్యాయం చేస్తా' అని కైలాష్ విజయవర్గీయ అన్నారు. 

విజయవర్గీయ ఇండోర్ నగరానికి మేయర్‌గా పనిచేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. బీజేపీలో ఉన్నత పదవుల్లో కొనసాగారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన్ను ఇండోర్ అసెంబ్లీ-1 నుంచి పోటీకి నిలిపింది బీజేపీ. ఆయన కుమారుడు ఇండోర్-3 సీటు నుంచి పోటీలో నిలిచారు. 

ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక

మరిన్ని వార్తలు