చిన్నమ్మకు చోటు లేదు.. కోటిన్నర మంది మా వెంటే!

8 Jun, 2021 06:53 IST|Sakshi

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేను కైవశం చేసుకోవడం చిన్నమ్మ తరం కాదు అని మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగం, కడంబూరురాజు స్పష్టం చేశారు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ వ్యూహాలకు పదును పెట్టి ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జిల్లాల వారీగా అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశాల మీద నేతలు దృష్టి పెట్టారు.

ఆయా జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి, నేతలు ఎవ్వరు జారి పోకుండా ముందు జాగ్రత్తల్లో ఉన్నట్టుంది. ఆ మేరకు సోమ వారం విల్లుపురం జిల్లా కార్యవర్గం భేటీ సాగింది. ఈ సమావేశానంతరం మాజీ మంత్రి సీవీ షణ్ముగం మీడియాతో మాట్లాడారు. ఎండిన కరువాడు ఎలా చేప అవుతుందంటూ పరోక్షంగా చిన్నమ్మను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. 

వెయ్యి మంది చిన్నమ్మలు వచ్చినా.. 
వందమంది కాదు, వెయ్యి మంది చిన్నమ్మలు వచ్చినా అన్నాడీఎంకేను కైవశం చేసుకోలేరని, ఆ మేరకు బలంగా పార్టీ ఉందని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలోని కోటిన్నర మంది సభ్యులు పన్నీరు, పళని నాయకత్వాన్ని బల పరుస్తున్నారని తెలిపారు. ఇంత పెద్దసంఖ్యలో కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నప్పుడు, చేజిక్కించుకునే  సాహసాన్ని ఆమె చేసే ప్రసక్తే లేదని, తాజా ప్రకంపనలన్నీ పార్టీలో గందరగోళానికి కుట్రలేనని పేర్కొన్నారు.

ఇక, తూత్తుకుడిలో జరిగిన సమావేశానంతరం మీడియాతో మాజీ మంత్రి కడంబూరు రాజు అన్నాడీఎంకేను కైవశం చేసుకుంటామని చెబుతూ, చీలికతో కొత్త కుంపటి ఏర్పాటు చేసుకున్న వారి అడ్రస్సే ఎన్నికల్లో గల్లంతైందని పరోక్షంగా చిన్నమ్మ ప్రతినిధి దినకరన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. పార్టీలోకి ఎవర్ని తీసుకోవాలో, పార్టీని ఎలా రక్షించుకోవాలో అధిష్టానం పెద్దలు చూసుకుంటారని, కుట్రలు, వ్యూహాలు చేస్తే, తిప్పికొట్టేందుకు పెద్దలు సిద్ధంగానే ఉన్నట్టు ధీమా వ్యక్తం చేశారు. తమ కార్యకర్తల బలంతోనే మళ్లీ అధికారంలోకి వస్తామని పేర్కొన్నారు.
చదవండి: జూన్‌ 21 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగానే టీకా

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు