ఓ వైపు ప్రధాని మోదీ... మరోవైపు తేజస్వి!

10 Nov, 2020 20:40 IST|Sakshi

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై శరద్‌ పవార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

పుణె: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ తనయుడు తేజస్వి యాదవ్‌ పోరాడిన తీరు యువతకు స్ఫూర్తిదాయకమని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. మంగళవారం నాటి ఫలితాల వల్ల రాష్ట్రంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాకపోయినప్పటికీ, సమీప భవిష్యత్తును ప్రభావితం చేయగలవని పేర్కొన్నారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రౌండ్‌ రౌండ్‌కు ఫలితాలు తారుమారు అవుతుండటంతో ఎన్డీయే, మహాగట్‌ బంధన్‌(ఆర్జేడీ- కాంగ్రెస్‌ కూటమి) మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ విషయంపై స్పందించిన శరద్‌ పవార్‌ పుణెలో విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ- జేడీయూ కూటమే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. (చదవండి: రానున్న ఎన్నికలకు ట్రైలర్‌ వంటిది: సీఎం )

‘‘ఎన్నికల ప్రచారాన్ని గమనించినట్లయితే ఓ వైపు.. ముఖ్యమంత్రిగా ఎన్నో ఏళ్లు గుజరాత్‌ను పాలించిన, రెండోసారి ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ.. ఆయనతో పాటు బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తే.‌. మరోవైపు.. ఏమాత్రం అనుభవం లేని తేజస్వి యాదవ్‌ వంటి యువకుడు సొంతంగా పోరాడాడు. అతడు ప్రదర్శించిన ధైర్యం యువతకు స్ఫూర్తిదాయకం. ఈనాటి ఫలితాలు పెద్దగా మార్పు తీసుకురానప్పటికీ, భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని ఆశించవచ్చు’’అని పేర్కొన్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఆర్జేడీ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్డీఏ 100 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. హసన్‌పుర్‌ నియోజకవర్గం నుంచి లాలూ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ గెలుపొందారు.(చదవండి: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: లైవ్‌ అప్‌డేట్స్‌)

>
మరిన్ని వార్తలు