తమ్మినేని వర్సెస్‌ షర్మిల 

5 Apr, 2023 03:41 IST|Sakshi

కమ్యూనిస్టులు బీఆర్‌ఎస్‌కు బీ టీం 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సమక్షంలోనే షర్మిల విమర్శలు 

షర్మిల వ్యాఖ్యలను ఖండించిన తమ్మినేని 

తమ ఆఫీసులో విమర్శ సరికాదని హితవు 

సాక్షి, హైదరాబాద్‌: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల మధ్య రాజకీయ దుమారం చెలరేగింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగ సమస్యపై కలసి పనిచేసే అంశంపై చర్చించేందుకు మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన షర్మిల... కాసేపు తమ్మినేని వీరభద్రంతో సమావేశమయ్యారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై పోరు కోసం టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం నాయకత్వంలో తెలంగాణ స్టూడెంట్స్‌ యాక్షన్‌ ఫర్‌ వేకెన్సీస్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ (టీ–సేవ్‌) అనే ఫోరం ఏర్పాటుకు ప్రతిపాదించారు. అనంతరం షర్మిల, తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారి మధ్య వాదనలు తలెత్తాయి. 

ఇద్దరి మధ్య విమర్శలు.. ప్రతివిమర్శలు 
‘సీపీఎం చేసిన ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు వైఎస్సార్‌టీపీ మద్దతివ్వలేదని తమ్మినేని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అన్నా.. (తమ్మినేనిని ఉద్దేశించి) ఎప్పుడైనా విపక్ష పా ర్టీ లకు కలసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారా? ఈ అంశంపై నాకు ఎప్పుడైనా ఫోన్‌ చేశారా? నేను బీజేపీకి బీ టీం అయినట్లు, నేను నాటకాలు ఆడుతున్నట్లు తమ్మినేని ఆరోపిస్తున్నారు. నాటకాలు మేము ఆడలేదు. మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్‌కు బీ టీంగా పనిచేసింది కమ్యూనిస్టులే. వైస్సాఆర్‌టీపీ ఇంతవరకు ఏ పార్టీకి బీ టీంగా పనిచేయలేదు’అని షర్మిల తమ్మినేని ముందే నిలదీశారు.

దీంతో పక్కనే ఉన్న తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ‘వైఎస్సార్‌ కూతురిగా, వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలిగా సీపీఎం కార్యాలయానికి వచ్చి మాతో మాట్లాడతామంటే ఆహ్వానించాం. కానీ సోదరి ఆ మర్యాద నిలుపుకోవట్లేదు. పా ర్టీ లకు రాజకీయ వైఖరులు ఉంటాయి. మునుగోడులో మేము ఏమీ చాటుగా చేయలేదు. బాహాటంగానే బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నాం. దానికిగల రాజకీయ వైఖరి ఏమిటో చెప్పాం. పైకొకటి లోనకటి చేసే రాజకీయ పార్టీ కాదు సీపీఎం. ఇదొక జాతీయ పార్టీ. వారికి బీ టీం.. వీరికి బీ టీం అని మా ఆఫీసుకు వచ్చి మాట్లాడే సాహసం చేయడం మంచిది కాదు. ఆమె మాట్లాడినట్లుగా నేను మాట్లాడలేను. ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా’అని పేర్కొన్నారు.

అయితే షర్మిల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. కాగా, నిరుద్యోగ సమస్యపై విపక్షాల ఐక్య పోరాటానికి షర్మిల చేసిన ప్రతిపాదనపై తమ పార్టీ కమిటీలో చర్చించి నిర్ణయం చెబుతామన్నారు. అయితే దేశంలో మతోన్మాదానికి ఆజ్యంపోయడంతోపాటు కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న బీజేపీతో కలసి రాష్ట్రంలో పోరాడే ప్రసక్తేలేదని ఆయన తేలి్చచెప్పారు. 

కూనంనేనికి వినతిపత్రం... 
తమ్మినేనితో భేటీ అనంతరం షర్మిల సీపీఐ కార్యాలయానికి వెళ్లారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో భేటీ అయ్యారు. నిరుద్యోగుల సమస్యలపై కలసి పోరాడదామని విజ్ఞప్తి చేస్తూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై అన్ని పా ర్టీ లు కలిసొచ్చి ‘టీ–సేవ్‌’ఏర్పాటు చేద్దామని తాను ప్రతిపాదించినట్లు తెలిపారు.

ఎవరు ప్రతిపాదించారనేది ముఖ్యంకాదని, ఎవరో ఒకరు ప్రతిపాదించకపోతే ముందుకు వెళ్లదన్నారు. కూనంనేని తమ ఆహా్వనాన్ని స్వాగతించారన్నారు. బీజేపీయేతర కూటమి అయితే కలసి రావడానికి సిద్ధమని చెప్పారన్నారు. కూనంనేని మాట్లాడుతూ షర్మిల ప్రతిపాదనపై తమ పార్టీ కమిటీలో మాట్లాడతామని చెప్పారు.  

మరిన్ని వార్తలు