మోదీ బంగ్లా పర్యటన: శశి థరూర్‌ క్షమాపణలు

27 Mar, 2021 11:49 IST|Sakshi

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను  తప్పుగా అర్థంచేసుకున్నందుకు  కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ క్షమాపణలు చెప్పారు. శశి థరూర్‌ తన తప్పును తెలుసుకున్నానని, ఇది ​కేవలం ప్రముఖ న్యూస్‌ఛానల్‌లో వచ్చిన హెడ్‌లైన్స్‌ను సరిగ్గా చదవక పోవడంతో తప్పు దొర్లిందని, క్షమించండి అంటూ ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. 1971లో  పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ను వేరు చేయడంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను ప్రధాని మోదీ అంగీకరింలేదంటూ శశి థరూర్ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌కు కూడా ప్రధాని మోదీ భారతీయుల ఫేక్‌ న్యూస్‌ రుచి చూపిస్తూన్నారని థరూర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌కు  స్వేచ్ఛను ఎవరు ప్రసాదించారో అందరికీ తెలుసు  అంటూ ఆయన ట్విటర్లో చెప్పుకొచ్చారు.

ఇక థరూర్‌ ట్వీట్‌ నేపథ్యంలో ప్రధాని మోదీపై కొందరు కాంగ్రెస్‌ నాయకులు విమర్శనాస్త్రాలు కూడా ఎక్కుపెట్టారు.  అయితే, బంగ్లాకు స్వాతంత్ర్యం సిద్ధించడంలో ఇందిరా కృషిని ప్రధాని మోదీ గుర్తు చేయగా.. థరూర్‌ దానిని తప్పుగా అర్థం చేసుకుని ట్వీట్‌ చేసినట్టు వెల్లడైంది. తర్వాత పొరపాటు గ్రహించిన థరూర్‌ తాజాగా తను చేసిన ట్వీట్‌ను తొలగించారు. దాంతో పాటు క్షమాణలు కూడా చెప్పారు. ‘పొరపాటు చేసినప్పుడు అంగీకరించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’అని ఆయన ట్విటర్‌లో చెప్పుకొచ్చారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హాసినాతో పలు ద్వైపాక్షిక అంశాలపై ఆయన నేడు చర్చించనున్నారు.

చదవండి: ప్రధాని మోదీకి నిరసన సెగ: నలుగురి మృతి

మరిన్ని వార్తలు