Shashi Tharoor: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి రేసులో ఎంపీ శశిథరూర్‌!

30 Aug, 2022 10:48 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎంపీ శశిథరూర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి రేసులో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పోటీలో దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా మలయాళ దినపత్రిక మాతృభూమిలో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలను ప్రస్తావిస్తూ థరూర్‌ ఓ ఆర్టికల్‌ రాశారు. అందులో కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎన్నికలు స్వేచ్చగా, పారదర్శకంగా జరగాలని డిమాండ్‌ చేశారు. ఈ ఎన్నికతో పాటు పార్టీలో సీడబ్ల్యూసీ సభ్యుల ఎన్నికను నిర్వహించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 

శశిథరూర్‌ ఆలోచన ఇలా ఉంటే, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆలోచన మాత్రం మరోలా ఉంది. అధ్యక్ష ఎన్నికల బరిలో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ను బరిలోకి దింపాలని సోనియా గాంధీ యోచిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్‌గాంధీ నిరాకరించారు. ఈ నేపథ్యంలో మధ్యే మార్గంగా తమ విధేయుడు అశోక్‌ గెహ్లాట్‌కు పగ్గాలు అప్పగించాలని సోనియా గాంధీ భావిస్తున్నారు. అయితే దీనిపై అశోక్‌ గెహ్లాట్‌ స్పందిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తల సెంటిమెంట్లను అర్థం చేసుకుని రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించాలని కోరిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే, వచ్చే నెల 22న కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. సెప్టెంబర్‌ 24 నుంచి 30 దాకా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అక్టోబర్‌ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్‌ 8. ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో నిలిస్తే అక్టోబర్‌ 17న ఎన్నిక నిర్వహిస్తారు. అక్టోబర్‌ 19న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు విజేత పేరును ప్రకటిస్తారు.

చదవండి: (ఏం రాహుల్‌.. ఏం మాట్లాడుతున్నావ్‌.!)

మరిన్ని వార్తలు