బహిరంగ చర్చలు జరిగితే ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది

3 Oct, 2022 07:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ఘన చరిత గల కాంగ్రెస్‌ పార్టీకి తదుపరి అధ్యక్షులు ఎవరనే అంశంలో ఇరు అభ్యర్థుల మధ్య ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చాసమరానికి తాను సిద్ధమని కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి శశిథరూర్‌ తన మనసులో మాట బయటపెట్టారు. ఇటీవల తీవ్ర ఉత్కంఠ రేపిన బ్రిటన్‌ కన్జర్వేటివ్‌ పార్టీ సారథి, దేశ ప్రధాని రేసులో రిషి సునాక్, లిజ్‌ ట్రస్‌ నేరుగా పలుమార్లు చర్చావేదికలపై బలాబలాలు ప్రదర్శించిన నేపథ్యంలో అదే మాదిరి పోటీని థరూర్‌ కోరుకోవడం విశేషం.

ఆదివారం థరూర్‌ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖాముఖిలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘ సమర్థవంతమైన నాయకుడిగా నన్ను నేను ఎప్పుడో రుజువు చేసుకున్నా. దాదాపు మూడు దశాబ్దాలు ఐక్యరాజ్యసమితిలో కీలకమైన పలు పదవుల్లో బాధ్యతలు నెరవేర్చా.  భారత్‌లో రాజకీయ ప్రస్థానానికొస్తే.. ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడిని. మొదలుపెట్టిన ఐదేళ్లలోనే 20 రాష్ట్రాల్లో పదివేల మందికిపైగా ఇందులో క్రియాశీలక సభ్యులయ్యారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు కేవలం రెండున్నర వారాల వ్యవధి ఉంది. ఇంత తక్కువ టైమ్‌లో అందరు 9,000 మంది ప్రతినిధులను కలవడం కష్టం. అదే అభ్యర్థుల బహిరంగ చర్చలు జరిగితే ఎవరి సత్తా ఏమిటో ఇట్టే తెలుస్తుంది’ అని అన్నారు.
చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ

మరిన్ని వార్తలు