అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్‌

8 Oct, 2022 17:11 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు శశి థరూర్‌. తనకు ఎదురయ‍్యే సవాళ్ల నుంచి తానెప్పుడూ వెనక్కి తగ్గబోనని, పోటీలో చివరకు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు పార్టీలోని ఇద్దరు సహచరుల మధ్య జరుగుతున్న స్నేహపూర్వక పోటీ మాత్రమేనని పునరుద్ఘాటించారు. శశి థరూర్‌ నామినేషన్‌ ఉపసంహరణ చేసుకుంటున్నారని వస్తున్న వార్తలపై తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో ద్వారా స్పష్టత ఇచ్చారు.

‘కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో నేను నామినేషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు కాల్స్‌ రావటం ఆశ్చరానికి గురి చేసింది. వారు ఢిల్లీ అధిష్ఠానం నుంచి సమాచారం అందినట్లు చెప్పారు. అయితే.. అవన్నీ అవాస్తవం. నా జీవితంలో ఇంతవరకెప్పుడూ సవాళ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. తగ్గను కూడా. ఇది పోరాటం. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న స్నేహపూర్వక పోటీ. ఇందులో నేను చివరి వరకు పోరాడాలి. నేను పోటీలో ఉన్నా. అక్టోబర్‌ 17న హాజరై ఓటు వేయాలని కోరుతున్నాను. రేపటి కోసం, థరూర్‌ కోసం ఆలోచించండి’  - శశి థరూర్‌, కాంగ్రెస్‌ ఎంపీ 

నామినేషన్లకు చివరి రోజైన అక్టోబర్‌ 8న థరూర్‌ ఈ వీడియో పోస్ట్‌ చేయడంతో అధ్యక్ష పదవికి పోలింగ్‌ ఖాయమైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి థరూర్‌తో పాటు సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో పోలింగ్‌ అనివార్యమైంది. అక్టోబరు 17న ఓటింగ్‌ జరగనుంది. ఆ తర్వాత అక్టోబరు 19న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో 9వేల మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్‌ కమిటీ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడైన ఖర్గేకు ఎక్కువమంది మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: నేనేం సోనియా రిమోట్‌ను కాను

మరిన్ని వార్తలు