‘యూజ్‌లెస్‌ ఫెలో’ అని బాబు తిట్టింది మర్చిపోయారా?

11 Nov, 2020 17:42 IST|Sakshi

టీడీపీ నేతలపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆగ్రహం

సాక్షి, కర్నూలు: అబ్దుల్ సలాం ఘటనపై తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధిత కుటుంబం ఆత్మహత్య చేసుకున్న వారం రోజుల తర్వాత నీచమైన ఆలోచనతో రాజకీయ లబ్ది కోసం టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సిగ్గుచేటన్నారు. టీడీపీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ రామచంద్రరావు ఈ కేసులో నిందితులకు బెయిల్ ఇప్పించిన విషయం అందరికీ తెలుసునని, కానీ చంద్రబాబు నాయుడు, అచ్చెంనాయుడు, అఖిల ప్రియ, ఫారుక్‌ బెయిలు ఎలా వస్తుందంటూ గగ్గోలు పెట్టడటం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని మండిపడ్డారు.

ఇక గుంటూరులో ‘నారా హమారా టీడీపీ హమారా’ సభలో నంద్యాలకు చెందిన తొమ్మిది మంది యువకులు, బాబు ముస్లింలకు చేసిన అన్యాయం గురించి నిలదీస్తే, వారిపై దేశద్రోహం కేసు పెట్టించారని శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదే విధంగా ఆనాడు వారిపై కేసులు ఎందుకు పెడుతున్నారని అడగని టీడీపీ మాజీ మంత్రి ఫారుక్ ఈరోజు ఈ ఘటనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముస్లింలను ‘యూజ్‌లెస్‌ ఫెలో’ అని చంద్రబాబు నాయుడు అన్న మాటలు మర్చిపోయారా ఫారుక్‌ అంటూ చురకలు అంటించారు. 2017 నంద్యాల ఉప ఎన్నిక అనంతరం ఒకే కుటుంబంలోని 7 మంది ముస్లింలపై హత్య కేసు నమోదు చేయించింది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా అని ప్రశ్నించారు.(చదవండి: చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా: కొడాలి నాని)

ఆ హత్యకు కారణం టీడీపీకి చెందిన మనోహర్‌ గౌడ్‌!
‘‘గత నెలలో నంద్యాల పొన్నపురంలో దళిత న్యాయవాది సుబ్బరాయుడును దారుణంగా హత్య చేస్తే నోరుమెదపని టీడీపీ నాయకులు ఈ రోజు గొంతు పెంచి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఆ హత్యకు కారణం టీడీపీకి చెందిన మనోహర్ గౌడ్ కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించలేదా?’’ అని శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి మండిపడ్డారు. ‘‘అబ్దుల్ సలాం కుటుంబానికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని మొదట హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. బాధిత కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

ఆ కుటుంబం ఆత్మహత్యకు కారకులైన సీఐ, హెడ్ కానిస్టేబుబుల్‌ పైన చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తే మీరేమో బెయిలు ఇప్పించారు. రాబందుల్లా వ్యవహరిస్తున్న మీరు తీరు సరికాదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అచ్చెంనాయుడు వాళ్ల పార్టీ కార్యదర్శి న్యాయవాది రామచంద్రరావును పంపించి నిందితులకు బెయిల్ ఇప్పించడమే గాక ఎవరికి తెలియనట్టు బాధితులకు అన్యాయం జరిగిందని ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారు’’ అంటూ టీడీపీ తీరును ఎండగట్టారు.
.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా