Maharashtra Politics: అజిత్‌ పవార్‌ చేరికపై అసంతృప్తి, సీఎం రాజీనామా!.. స్పందించిన శివసేన

7 Jul, 2023 09:27 IST|Sakshi

సార్వత్రిక ఎన్నికలకు ముందు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతిపక్ష కూటమిలోనూ ఎన్సీపీలో అజిత్‌ పవార్‌ తిరుగుబాటు చేయడంతో రోజుకో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీపై పట్టుకోసం బాబాయ్‌-అబ్బాయ్‌ మధ్య తీవ్ర వార్‌ నడుస్తోంది. అయితే ఎన్సీపీ నేత అజిత్‌ పవార్ పార్టీని చీల్చుతూ ఆయన మద్దతుదారులతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడం, ఎనిమిది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఏక్‌నాథ్‌ శిండే(శివసేన) వర్గంలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

శివసేనలో చిచ్చు
మంత్రి పదవులు దక్కని కొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారని, అసంతృప్తితో ఉన్న 8–10 మంది మళ్లీ ఉద్ధవ్‌ ఠాక్రే వర్గంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం సైతం రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.  పార్టీలో నెలకొన్న అనిశ్చితిపై చర్చించేందుకే ముఖ్యమంత్రి షిండే తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని హడావిడీకి ముంబైకి వచ్చారని వదంతులు వ్యాపించాయి.

ఏ గందరగోళం లేదు
తాజాగా శివసేనపై వస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ నేత ఉదయ్‌ సావంత్‌ ఘాటుగా స్పందించారు. ఎన్సీపీ తిరుగుబాటు నేతలు అజిత్‌, ఆయన వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరడంపై శివసేనలో ఎలాంటి విభేదాల్లేవని, ఎవరో గిట్టనివారు వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఏక్‌నాథ్‌ షిండే సీఎం పదవి నుంచి తప్పుకునే ఆలోచనలు కూడా లేనట్లు స్పష్టం చేశారు. తాము రాజీనామా లేఖలు ఇచ్చేవాళ్లం కాదని, తీసుకునే వాళ్లమని వ్యాఖ్యానించారు. 
చదవండి: NCP Crisis: అబ్బాయికి బాబాయ్‌ చురకలు

సీఎం అత్యవసర భేటీ 
బుధవారం ముర్ముకు స్వాగతం పలికేందుకు నాగ్‌పూర్‌కు వెళ్లిన శిండే తన పర్యటనను అర్థంతరంగా ముగించుకుని  పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన నివాసంలో అత్యవసరంగా భేటీ అయిన సంగతి తెలిసందే. ఈ క్రమంలో ఉదయ్‌ సావంత్‌ మాట్లాడుతూ.. ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగమని అన్నారు. షిండే సారథ్యంలో తమ ప్రభుత్వం ప్రశాంతంగా ముందుకు సాగుతోందని చెప్పారు. సీఎం ప్రతి ఒక్కర్నీ కలుపుకొంటూ వెళ్తారని, చివరి వరకు ఓపిక పట్టడమే ఆయన నాయకత్వ లక్షణమని ఆయన అన్నారు. బుధవారం నాటి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలందరూ సీఎంకు మద్దతుగా నిలిచారని చెప్పారు. 

ఎన్సీపీతో వెళ్లవద్దని వాదన?
శిండే వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారని ఎన్సీపీతో వెళ్లకూడదని ఓ ఎమ్మెల్యే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయని, అలాంటిదేమీ జరగలేదన్నారు. ఎవరూ ఎటు వెళ్లాల్సిన పని లేదని, ప్రస్తుతానికి తమ ప్రభుత్వానికి 200 మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణ మెజార్టీ ఉందన్నారు. గతంలో తాము ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(ఉద్దవ్‌) నుంచి బయటకి వస్తే.. మమ్మల్ని ద్రోహులుగా చిత్రీకరించారని, ప్రస్తుతం ఎన్సీపీ కూడా అదే బాట పట్టిందని సామంత్‌ అన్నారు. అజిత్ పవార్ తమ ప్రభుత్వంలో కలవడం అంటే ఇప్పుడు శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి సరిగ్గా లేదనే అర్థం చేసుకోవచ్చునని చెప్పారు.

మరిన్ని వార్తలు