ఎగ్జిట్ పోల్స్ మేం నమ్మం.. మేమే అధికారంలోకి వస్తాం

8 Mar, 2022 19:30 IST|Sakshi

అకాలీదళ్ అధికార ప్రతినిధి దల్జిత్ సింగ్ చీమా

చండీగఢ్‌: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను శిరోమణి అకాలీదళ్ కొట్టిపారేసింది. బీఎస్పీతో కలిసి తమ పార్ట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అవసరమైతే బీజేపీతో చేతులు కలుపుతామని శిరోమణి అకాలీదళ్ అధికార ప్రతినిధి దల్జిత్ సింగ్ చీమా అన్నారు. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ఎగ్జిట్‌ పోల్స్‌ను తాము విశ్వసించబోమని చెప్పారు. 2017 పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కేవలం 20 సీట్లు మాత్రమే గెలుచుకుందని దల్జిత్ సింగ్ గుర్తు చేశారు. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్‌కు తమ పార్టీ ఎప్పుడూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. 

‘ఎన్నికల సమయంలో ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న వారికి మాత్రమే తెలుసు. మాకు మంచి ఫలితాలు వస్తాయని, అకాలీదళ్‌-బీఎస్‌పీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మేము నమ్ముతున్నాం. మేం మెజారిటీ సాధిస్తామ’ని దల్జిత్ సింగ్ పేర్కొన్నారు. 

ఎ‍న్నికల ఫలితాల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా.. ‘అలాంటి ప్రశ్న అప్రస్తుతం. ఎ‍న్నికల తుది ఫలితాలు వచ్చిన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మేము పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం రాదని  ఆశిస్తున్నామ’ని అన్నారు. (క్లిక్‌: పంజాబ్‌లో వచ్చేది ఆ పార్టీయేనా? ఆసక్తికర ఫలితాలు)

మరిన్ని వార్తలు