చిక్కుల శివసేనకు  బీఎంసీ ఎన్నికల్లో చుక్కలే! 

23 Jun, 2022 14:23 IST|Sakshi

సాక్షి, ముంబై: ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంపై చేసిన తిరుగుబాటు ప్రభావంతో వచ్చే బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికలు శివసేనకు తలనొప్పిగా మారనున్నాయి. షిండే తిరుగుబాటు ఘటన బీఎంసీ ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత పాతికేళ్లుగా బీఎంసీలో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్న శివసేన ఈసారి మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది.

ఒకవేళ మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ మరింత రెచ్చిపోయి శివసేనను ఇరకాటంలో పెట్టే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఎంసీలో జరిగిన భారీ అవినీతి కుంభకోణానికి వ్యతిరేకంగా బీజేపీ గళం విప్పనుంది. బీజేపీ ఆరోపణలకు సమాధానమివ్వాలంటే శివసేనకు ఇబ్బందికరమైన పరిస్థితేనని చెబుతున్నారు. మేయర్‌ పీఠాన్ని దక్కించుకుంటూ రికార్డు సృష్టిస్తున్న శివసేన ఈసారి పాతికేళ్ల రికార్డు బ్రేక్‌ అయ్యే పరిస్థితి రానుంది. 
చదవండి: శివసేన రెబల్స్‌కు బీజేపీ భారీ ఆఫర్‌!

దర్యాప్తు సంస్థల విచారణతో అసంతృప్తి 
కొద్ది నెలలుగా శివసేన, ఎన్సీపీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు చేసి విచారణ చేస్తుండటంతో మహా వికాస్‌ ఆఘాడి ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బీఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటం, ఈడీ విచారణ మరింత వేగవంతం కావడం వంటి వరుస ఘటనలతో శివసేనను బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. 2019లో మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బీఎంసీలో శివసేనకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ప్రతిపక్షపాత్ర పోషిస్తోంది.

గత రెండున్నరేళ్లుగా బీఎంసీలో తరుచూ ఆరోపణలు, ప్రత్యారోపణలతో లేదా వివిధ ప్రతిపాదనలను అడ్డుపెట్టుకుని ఏదో వంకతో శివసేనను ఇబ్బందుల్లో పెట్టే ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ వదులుకోలేదు. ఇప్పటికే నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎదుర్కొంటున్న ఈడీ విచారణ కారణంగా ప్రజల్లో శివసేన పేరు ప్రతిష్ట దెబ్బతింది. దీనికి తోడు ఇటీవల జరిగిన రాజ్యసభ, తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా వరుసగా ఎదురైన పరాజయాలు, ఇప్పుడు ఏక్‌నాథ్‌ షిండే చేసిన తిరుగుబావుట కారణంగా ఎంవీఏ సర్కారు నిలుస్తుందా..? కూలుతుందా..? అనే సందిగ్ధంలో ప్రజల్లో నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా, మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలు కలిసే పోటీచేస్తామని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, తాజా  పరిణామాలతో ఎన్సీపీ, కాంగ్రెస్‌లు శివసేనను ఏకాకిని చేస్తాయా..? లేక వెన్నంటి ఉంటాయా అనేదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.   

మరిన్ని వార్తలు