మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. కూటమిగా శివసేన–సంభాజీ బ్రిగేడ్‌

27 Aug, 2022 20:36 IST|Sakshi

ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ అయిన సంభాజీ బ్రిగేడ్‌ అధ్యక్షుడు ఆఖరే

ఎన్నికల్లో కలిసే పోటీచేస్తామని సంయుక్త ప్రకటన

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. రెండు పార్టీలు నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. స్ధానిక సంస్ధల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శివసేన, సంభాజీ బ్రిగేడ్‌ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇరు పార్టీల నేతలు వెల్లడించారు. సంభాజీ బ్రిగేడ్‌ పార్టీ అధ్యక్షుడు మనోజ్‌ ఆఖరే శుక్రవారం ఉదయం శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ అయ్యారు. సుమారు గంటకుపైగా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత ఇరువురు కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఉద్ధవ్‌ మాట్లాడుతూ ఇక నుంచి రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని, ప్రజాస్వామ్యాన్ని, బతికించేందుకు రెండు పార్టీలు ఒకటయ్యాయని అన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో సంభాజీ బ్రిగేడ్, శివసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యాన్ని, రీజినల్‌ పార్టీల అస్థిత్వాన్ని కాపాడేందుకే ఇరువురం ఒక్కటయ్యామని, ఇలాంటి పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీచేసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల శివసేన నుంచి తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్‌నాథ్‌ శిందేపై, బీజేపీ, ఆరెస్సెస్‌పై ఉద్ధవ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో మాదిరిగా ఇరు పార్టీలు పనిచేయడం లేదని, ఇరు పార్టీల ఆలోచన విధానాలు వేరయ్యాయని ఆరోపించారు. ఆరెస్సెస్‌ రెండుగా చీలిపోయిందని, క్రమంగా బలహీన పడుతోందని ఆయన చురకలంటించారు.  

శిందే తిరుగుబాటు సంచలనం.. 
ఒకప్పుడు రాష్ట్రంలో పటిష్టమైన, తిరుగులేని పార్టీగా ఎదిగిన శివసేనను ఏక్‌నాథ్‌ శిందే రెండుగా చీల్చారు. దీంతో మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. శివసేన నుంచి బయటపడిన శిందే బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉన్నారు. శిందే తిరుగుబాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామ చేయాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి శివసేన అస్ధిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

చదవండి: (గణేశ్‌ విగ్రహాల ధరలు పెరిగాయ్‌... ఎందుకంటే..)

గత్యంతరం లేక శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి అలాగే కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేనతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో శివసేన ఏకాకిగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి సందర్భంలో శివసేనతో జతకట్టేందుకు సంభాజీ బ్రిగేడ్‌ పార్టీ ముందుకు రావడంతో పరోక్షంగా మరింత బలాన్ని చేకూర్చినట్‌లైంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరాఠాలకు ఎన్నడూ న్యాయం జరగలేదని, స్వార్థం కోసం శివసేనను అంతర్గతంగా చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉద్ధవ్‌ ఆరోపించారు.

ఇద్దరం కలిసి నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతామని ఆయన స్పష్టం చేశారు. మరాఠా సమాజంలో చీలికలు తెచ్చేవారిని భూస్ధాపితం చేద్దామని ఉద్ఘాటించారు. అయితే ఇరు పార్టీల మధ్య సమన్వయం చేకూర్చేందుకు ప్రత్యేకంగా ఒక సమన్వయ సమితి కూడా ఏర్పాటు చేయనున్నట్లు శివసేన సీనియర్‌ నేత సుభాష్‌ దేశాయ్‌ వెల్లడించారు. రెండు పార్టీల ఆలోచన విధానాలు, పనిచేసే పద్దతి ఒకే రకంగా ఉన్నాయని, అందుకే ఇరువురి చేతులు కలిశాయని దేశాయ్‌ వ్యాఖ్యానించారు.   

మరిన్ని వార్తలు