వాల్‌స్ట్రీట్‌ కథనంపై స్పందించిన శివసేన

18 Aug, 2020 14:38 IST|Sakshi

ముంబై: సోషల్‌ మీడియా వేదికగా బీజేపీ దేశంలో మత విద్వేషాన్ని వ్యాపింపచేస్తోందని శివసేన ఆరోపించింది. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్‌ చూసీచూడనట్లుగా వదిలేస్తోందనే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం రాజకీయ వేడిని రగిలించిన సంగతి తెలిసిందే. దీనిపై శివసేన స్పందించింది. సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని బీజేపీ గత ఎన్నికల్లో ఎంతో లాభపడటమే కాక.. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మత విద్వేశాన్ని వ్యాప్తి  చేసి రాజకీయంగా బలపడిందని ఆరోపించింది. బీజేపీపై ఫేస్‌బుక్‌ చర్యలు తీసుకోకపోవడం పట్ల శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఫేస్‌బుక్‌ వేదికగా ఎవరైనా సరే దేశాన్ని విభజించడానికి ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తే.. వారు ఏ పార్టీకి చెందినవారు అనే దానితో సంబంధం లేకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీ అయినంత మాత్రాన కళ్లుమూసుకుని కూర్చోకూడదు’ అంటూ శివసేన తీవ్రంగా విమర్శించింది. (విద్వేషంపై ఉదాసీనత)

అంతేకాక ‘బీజేపీ నాయకులు ఈ సోషల్‌ మీడియా వేదికలను సమాజాన్ని అనుసంధానించడానికి బదులు ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి వినియోగిస్తున్నారు. ఈ వేదికలు రాజకీయ పార్టీల కనుసన్నల్లో మెలుగుతాయి. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ సోషల్‌ మీడియా సైన్యం బీజేపీకి ఎంతో సహకరించింది. అందువల్లే మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయం సాధించింది’ అని తెలిపింది. అంతేకాక ‘గత ఏడు సంవత్సరాలలో సత్యాన్ని వక్రీకరించి.. అబద్దాన్ని వాస్తవాలుగా చూపిస్తూ.. బహిరంగంగా ప్రచారం చేశారు. రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు, పుకార్లు ప్రచారం చేశారని’ శివసేన ఆరోపించింది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీద సోషల్‌ మీడియాలో చాలా కాలం వరకు మీమ్స్‌, జోకులు ప్రచారంలో ఉన్నాయని సామ్నా ఎత్తి చూపింది. అయితే ఇప్పుడు అదే వేదిక మీద మోదీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌పై ఆగ్రహం వ్యక్తం అవుతోందన్నది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. శివసేన వ్యాఖ్యలు హాస్యాస్పాదంగా ఉన్నాయన్నది. (బీజేపీకి వత్తాసు : ఫేస్‌బుక్‌ క్లారిటీ)

మరిన్ని వార్తలు