Shiv Sena Crisis: సేన సంక్షోభం ముగింపు.. షిండే-ఉద్దవ్‌ థాక్రేల భేటీ! ట్వీట్‌పై రౌత్‌ స్పందన

18 Jul, 2022 07:58 IST|Sakshi

ముంబై: శివ సేన పార్టీ అంతర్గత సంక్షోభం ఓ కొలిక్కి రానుందా? మహారాష్ట్ర సీఎం.. రెబల్‌ గ్రూప్‌ నేత ఏక్‌నాథ్‌ షిండే, శివ సేన అధినేత..మాజీ సీఎం ఉద్దవ్‌ థాక్రే భేటీ కానున్నారా? ఇందుకు బీజేపీనే మధ్యవర్తిత్వం వహించబోతుందా?.. 

మరాఠీ నటి దీపాలి సయ్యద్ చేసిన ట్వీట్‌ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. శివ సేన నేతగా చెప్పుకుంటున్న ఆమె ఈ మేరకు వీళ్ల భేటీ గురించి ఓ ట్వీట్‌ చేశారు. పార్టీలో విభేధాలపై చర్చించేందుకు షిండే, థాక్రేలు భేటీ కాబోతున్నారంటూ ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. కొందరు బీజేపీ నేతల దౌత్యంతో రెండు రోజుల్లో ఈ ఇద్దరు భేటీ కానున్నట్లు ఆమె పేర్కొన్నారు. శివ సైనికుల సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుని షిండే, పార్టీ అనే కుటుంబానికి పెద్దగా థాక్రే సహృదయంతో సామరస్యంగా చర్చించుకునేందుకు ముందుకు వచ్చారని ఆమె తెలిపారు.  

దీపాలి సయ్యద్‌ 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో థానే జిల్లాలోని ముంబ్రా-కల్వా నియోజకవర్గం నుంచి శివసేన టిక్కెట్‌పై పోటీ చేసి ఓడారు. 2014లో ఆప్‌ టికెట్‌పై పోటీ చేసి ఓడారు.

అయితే దీపాలి సయ్యద్‌ ట్వీట్‌పై శివ సేన ఎంపీ సంజయ్ రౌత్‌ స్పందించారు. అలాంటి పరిణామం గురించి తనకేం తెలియదని, పార్టీలో తానొక చిన్న కార్యకర్తనంటూ వెటకారంగా మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి పదిహేను రోజులు కావొస్తున్న మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడంపై ఆయన షిండే-ఫడ్నవిస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగబద్ధమైన చిక్కులతోనే వాళ్లు ఇబ్బందిపడుతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ సంజయ్‌ రౌత్‌.

బుధవారం సుప్రీం విచారణ

సేనలోని ఉద్ధవ్, షిండే వర్గాల పిటిషన్లను జులై 20న విచారించనుంది సుప్రీం కోర్టు.  మహారాష్ట్రలో శివసేనలో తిరుగుబాటుకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను విచారణ చేపట్టనుంది. ప్రత్యర్థి పక్షం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఉద్ధవ్ థాక్రే శిబిరం, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఎమ్మెల్యేల అనర్హతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని జూలై 11న సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్‌ను కోరింది. అసెంబ్లీలో కొత్త స్పీకర్ ఎన్నికను సవాల్ చేస్తూ థాక్రే వర్గం చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

చదవండి: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు