Maharashtra Crisis: అప్పుడు కుక్కలు, పందులని.. ఇప్పుడు రమ్మని అడుగుతున్నారా?

28 Jun, 2022 20:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజులుగా సాగుతున్న ఎమ్మెల్యేల తిరుగుబాటు వ్యవహారం కొలిక్కి రాలేదు. అయితే, తాజాగా ఈ వివాదం కోర్టుకెక్కడంతో త్వరలోనే సంక్షోభానికి ఎండ్‌ కార్డ్‌ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం  శివసేన రెబల్ ఎమ్మెల్యేలంతా గువాహటిలోని ఓ హోటల్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 

ఉద్ధవ్‌పై ఏక్‌నాథ్‌ షిండే మండిపాటు
ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్‌ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెబెల్‌ ఎమ్మెల్యే తిరిగి ముంబై రావాలని సీఎం ఉద్ధవ్‌ చేసిన విజ్ఞప్తిపై స్పందించిన ఏక్‌నాథ్‌ కౌంటర్‌ అటాక్‌ చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో విరుచుపడ్డారు.

‘ఓ వైపు ఆదిత్య ఠాక్రే మమ్మల్ని కుక్కలు, పందులు, మేకలు అని తిడుతూనే.. మరోవైపు తిరిగి రావాలని విజ్ఙప్తి చేస్తున్నారు. మా ఆత్మలు నశించాయని, వట్టి దేహాలే ఉన్నాయని ఒకరు.. ముంబై ఎలా వస్తారో చూస్తామని మరికొందరు శివసేన నేతలు బెదిరించారు. ఇప్పుడే సమస్యలు పరిస్కరించుకుందాం రండి అని పిలుస్తున్నారు’ అని ఏక్‌నాథ్‌ షిండే ట్వీట్‌ చేశారు.
సంబంధిత వార్త: రెబెల్స్‌ ఎమ్మెల్యేలకు సీఎం ఉద్దవ్‌ భావోద్వేగ లేఖ!

దయచేసి ముంబై తిరిగి రండి: ఉద్దవ్‌
శివసేన రెబెల్‌ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే మంగళవారం భావోద్వేగ లేఖ రాశారు.  రెబెల్‌ ఎమ్మెల్యేలు ముంబైకు తిరిగి వచ్చి తనతో మాట్లాడాలని కోరారు. సమయం ఇంకా మించి పోలేదని, రెబెల్‌ ఎమ్మెల్యేలను శివసేన వదులుకోలేదని, ముంబైకు వస్తే చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని కోరారు. శివసేన ఇచ్చిన గౌరవం మరెక్కడా దొరకదని అన్నారు.

‘మీకు సమస్య ఉంటే చర్చలతో పరిష్కరించుకుందాం తప్ప ఇది సరైన దారి కాదు. గత కొద్ది రోజులుగా గౌహతిలో ఉంటున్న రెబెల్‌ ఎమ్మెల్యేల గురించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. శివసేన కుటుంబ అధినేతగా నేను మీ మనోభావాలను గౌరవిస్తాను, ముందుగా ఈ గందరగోళం నుంచి బయటపడండి. మిమ్మల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు, దాని నుంచి బయటపడాలి. అందరం కలిసి ఒక పరిష్కారం కనుగొద్దాం’ అని ఠాక్రే ఆ లేఖలో సూచించారు.
చదవండి: వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే?

మరిన్ని వార్తలు