కిడ్నాప్‌ చేసి బలవంతంగా ఇంజెక్షన్లు ఇచ్చారు: శివసేన ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు

22 Jun, 2022 17:21 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో పొలిటికల్‌ హైడ్రామా కొనసాగుతోంది. మహా సంక్షోభంలో తాజాగా ఓ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండేతో కలిసి సూరత్‌ వెళ్లిన శివసేన ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్‌ అక్కడి నుంచి తిరిగి మహారాష్ట్ర చేరుకున్నారు. ఈ సందర్భంగా రెబల్‌ ఎమ్మెల్యేలపై నితిన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను కిడ్నాప్ చేసి సూరత్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు. కొంతమంది బలవంతంగా ఆసుపత్రిలో చేర్పించి తనకు గుండెపోటు రానప్పటికీ ఇంజెక్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు. సూరత్‌ నుంచి తప్పించుకొని సురక్షితంగా బయటపడ్డానని అన్నారు. తను శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రేకు మద్దతుగా ఉన్నానని స్పష్టం చేశారు. 

సీఎంకే నా మద్దతు
‘నేను ఉద్ధవ్ ఠాక్రే, బాలాసాహెబ్ ఠాక్రేల శివసైనికుని. నన్ను కిడ్నాప్ చేసి సూరత్‌కు తీసుకెళ్లారు.. అక్కడి నుంచి తప్పించుకుని తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రోడ్డుపై వచ్చి నిలబడ్డాను. రోడ్డుపై వెళ్తున్న వాహనాల ద్వారా అక్కడి నుంచి బయటపడాలని అనుకున్నా. కానీ అదే సమయంలో  వంద మందికి పైగా పోలీసులు వచ్చి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

వారు నాకు గుండెపోటు వచ్చినట్లు నటించారు. నాకు కొన్ని వైద్య ప్రక్రియలను నిర్వహించడానికి ప్రయత్నించారు. నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఎప్పుడూ హృద్రోగ సమస్యలు లేవు. నా ఆరోగ్యానికి ఏం కాలేదు. వారు తప్పుడు ఉద్దేశంతో అలా చెప్పారు. నాకు బలవంతంగా కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చారు. అక్కడి నుంచి తప్పించుకొని ప్రత్యేక విమానంలో మహారాష్ట్ర చేరుకున్నాను.’ అని తెలిపారు.
చదవండి: Live Updates: ‘మహా’ సంకటం.. అసెంబ్లీ రద్దు.?

నితిన్‌ భార్య ఫిర్యాదు
కాగా ఇంతకుముందు మంగళవారం నితిన్‌ దేశ్‌ముఖ్‌ భార్య.. తన భర్త సోమవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని  స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  తన భర్త కు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నితిన్ దేశ్‌ముఖ్ అకోలా జిల్లాలోని బాలాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏక్‌నాథ్ షిండే శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేల్లో నితిన్ కూడా ఉన్నారు. 
చదవండి: రెబల్‌ ఎమ్మెల్యేలకు శివసేన అల్టీమేటం.. కన్నీరు పెట్టుకున్న కార్యకర్తలు

>
మరిన్ని వార్తలు