‘మహా’ సంక్షోభం: పవార్‌ను బెదిరిస్తారా? రెబల్స్‌కు ఛాన్స్‌ల్లేవ్‌.. ఇక తాడోపేడో!

24 Jun, 2022 12:59 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని పరోక్ష ఆరోపణలు గుప్పించారు. అంతేకాదు రెబల్స్‌కు అల్టిమేటం జారీ చేశారాయన.

మహా వికాస్ అఘాడి(కూటమి ప్రభుత్వం)ని కాపాడేందుకు శరద్ పవార్ ప్రయత్నిస్తే.. ఇంటికి వెళ్లనివ్వబోమని, రోడ్డుపై అడ్డుకుంటామని ఓ కేంద్ర మంత్రి బెదిరించారు. ఒకవేళ ఈ పని చేసింది బీజేపీనే అయితే.. బయటకు చెప్పుకోండి. ప్రభుత్వం ఉండినా, ఊడినా.. శరద్‌పవార్‌ లాంటి నేత మీద ఇలాంటి మాటలు ఆమోదయోగ్యం కాదు అని సంజయ్‌ రౌత్‌ ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేశారు.

ఇక మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది రెబల్ లీడర్ ఏక్‌నాథ్ షిండే గూటికి చేరడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సహా ఆ పార్టీ అగ్రనాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తర్వాతి అడుగు ఏంటన్నదానిపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కనివ్వడం లేదు. 

ఇక సమరమే!
సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన నేతలంతా పరస్పరం టచ్‌లో ఉన్నాం. మా బలమేంటో పరీక్షలో నెగ్గి చూపిస్తాం. అవకాశాన్ని వదలుకోం.. గెలిచి తీరతాం. వాళ్లు ( రెబల్‌ ఎమ్మెల్యేలు) చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ముంబైకి తిరిగి వచ్చే అవకాశం కూడా ఇచ్చాం. ఇప్పుడు, ముంబైకి రావాలని వాళ్లను సవాలు చేస్తున్నాం. ఈ పోరాటంలో పశ్చాత్తప పడాల్సిన అవసరం లేదు. ఇంటా(అసెంబ్లీ).. బయటా(రోడ్లపై) గెలిచి తీరతాం. వాళ్లకు వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఇచ్చాం. కానీ, ఆలస్యమైంది. బలనిరూపణతోనే తేల్చుకోవాలని వాళ్లకు చాలెంజ్‌ చేస్తున్నా. మహా వికాస్‌ అగాడి  ప్రభుత్వం మిగిలిన రెండున్నరేళ్లు కూడా పూర్తి చేసుకుని తీరుతుందని సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు