ఇది మహారాష్ట్ర.. బీజేపీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి!: సంక్షోభ సంకేతాలపై శివసేన స్పందన

21 Jun, 2022 12:09 IST|Sakshi
దేవేంద్ర ఫడ్నవిస్.. సంజయ్‌ రౌత్‌(ఫైల్‌ ఫొటో)

మహారాష్ట్రలో మంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో తిరుగుబాటు జెండా ఎగరనుందనే ఊహాగానాల నడుమ.. శివ సేన నేత సంజయ్‌ రౌత్‌ స్పందించారు. కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆయన.. బీజేపీపై మండిపడ్డారు. 

శివ సేన నేత ఏక్‌నాథ్‌ షిండే, కొందరు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో తెలియడం లేదు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు బలంగానే సాగుతున్నాయి. కానీ, బీజేపీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మహారాష్ట్ర.. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లా కాదు. చాలా వేరుగా ఉంటుంది ఇక్కడి రాజకీయం. 

ఏక్‌నాథ్‌ షిండే నిజమైన శివ సైనికుడు. ఎంతో నమ్మకస్థుడు.. నిజాయితీ పరుడు కూడా. ఆయన ఎలాంటి షరతులు లేకుండా తిరిగి వస్తారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు సంజయ్‌ రౌత్‌. ఇదిలా ఉంటే రౌత్‌ వ్యాఖ్యలపై.. బీజేపీ నేత ప్రవీణ్‌ దరేకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

మహారాష్ట్రలోని ఎంవీఏ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేయలేదు. అంతేకాదు ప్రజా ప్రతినిధులు కూడా ఆ విషయంలో అసంతృప్తిగా ఉందనే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు. మహారాష్ట్ర మిగతా రాష్ట్రాల్లా కాదేమో.. కానీ, అది వాళ్ల (శివ సేనను ఉద్దేశిస్తూ..) సొత్తేం కాదు. బీజేపీ ఇక్కడ పెద్ద పార్టీ. దేవేంద్ర ఫడ్నవిస్ గొప్ప నేత. రెండున్నరేళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసిందో అంతా చూస్తున్నారు. ప్రజల కోసం, పార్టీ కోసం ఏది మంచిదో అది చేసి తీరతాం. అంతేకానీ అధికారం కోసం కాదు. అధికారం కంటే.. ప్రజలే ముఖ్యం అని పేర్కొన్నారు ప్రవీణ్‌ దరేకర్‌. 

బీజేపీది అధికార దుర్వినియోగం
క్రాస్‌ ఓటింగ్‌ నేపథ్యంలో.. మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ నేత నానా పటోల్‌ స్పందించారు. బీజేపీ గెలుపు గెలుపే కాదని, చివరికి సత్యమే గెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ నేతలతో ఇవాళ(మంగళవారం) భేటీ నిర్వహించనున్నట్లు తెలిపారాయన.

మరిన్ని వార్తలు