‘బీజేపీ పక్కా ప్లాన్‌ ప్రకారమే దారి మళ్లించింది’

28 Jan, 2021 17:55 IST|Sakshi

బీజేపీ తాను అనుకున్నది సాధించింది

ఉద్యమంలో హింసను రాజేసి.. దారి మళ్లించింది: శివసేన

ముంబై: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు రెండు నెలల పాటు శాంతియుతంగా కొనసాగిన రైతుల ఉద్యమం గణతంత్ర దినోత్సవం నాడు ఉద్రిక్తంగా మారింది. హింస చోటు చేసుకుంది. ఆ తర్వాత రైతు సంఘాల మధ్య చీలికలు ఏర్పడి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఓ పథకం ప్రకారమే రైతుల ఉద్యమం హింసాయుతంగా మారేలా చేశాయని శివసేన ఆరోపించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నాలో కేంద్రం తీరును ఎండగడుతూ పలు విమర్శలు చేసింది.

‘‘కేంద్రం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. దాదాపు 60 రోజుల పాటు శాంతియుతంగా కొనసాగిన రైతుల ఉద్యమంలో ఎలాంటి చీలికలు రాలేదు.. వారు సహనం కోల్పోలేదు. రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు లభించడం.. విదేశాల్లో సైతం మోదీ ప్రభుత్వం పట్ల విమర్శలు రావడంతో కేంద్రం ఈ ఉద్యమాన్ని నీరు కార్చాలని చూసింది. దాంతో ఉద్యమంలో హింస చేలరేగేలా చేసి దారి మళ్లేలా చూసింది’’ అంటూ శివసేన ఆరోపించింది. ‘‘కర్రలతో ఉన్న రైతులను మోదీ ప్రభుత్వం దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తుంది.. మరి ‘‘గోలీ మారో’’, ‘‘ఖతం కరో’’ అని నినాదాలు చేసిన వ్యక్తులు మాత్రం ఇంకా మోదీ క్యాబినేట్‌లోనే ఉన్నారు.. వారి సంగతి ఏంటి’’ అని ప్రశ్నించింది. 
(చదవండి: నేతాజీ జయంతి.. వేడెక్కిన రాజకీయం)

ఇక ‘‘గణతంత్ర దినోత్సవం నాడు చెలరేగిన హింసలో బీజేపీ పాత్ర ఉంది. ముందస్తు ప్రణాళిక​ ప్రకారమే బీజేపీ రైతులు ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చి.. దారి మళ్లించింది. ఉగ్రవాదులు ఆందోళన చేపట్టారు. ఇక ఎర్రకోట వద్ద హింస చేలరేగడానికి ప్రధాన కారకుడు దీప్‌ సిధు​. అతడికి బీజేపీతో సంబంధం ఉంది. పంజాబ్‌ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌కి, దీప్‌ సిధుకి మధ్య అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. సిధు గత రెండు నెలలుగా రైతులను రెచ్చగొడుతున్నాడని.. కానీ వారు సమన్వయం కోల్పోలేదని రైతుల సంఘాల నాయకులు పలువురు వెల్లడించారు’’ అంటూ శివసేన సామ్నాలో రాసుకొచ్చింది. ఇక ఎర్రకోట వద్ద చేలరేగిన హింసకు కేవలం రైతుల్ని మాత్రమే బాధ్యుల్ని చేయడం సరైంది కాదని శివసేన అభిప్రాయ పడింది. ప్రభుత్వం తాను ఏం చేయాలనుకుందో అదే చేసి చూపింది. ఫలితంగా రైతులు, పోలీసులు ఇబ్బంది పడ్డారు. ఏది ఏమైనా హింసను ప్రోత్సాహించలేము అని తెలిపింది. 

మరిన్ని వార్తలు