శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది

27 Jul, 2022 14:49 IST|Sakshi
ఉద్ధవ్ థాక్రే

ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో శివసేనకు చెందిన వ్యక్తే మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని ప్రజలకు హామీ ఇచ్చారు. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రయోగాన్ని ఆయన వెనకేసుకొచ్చారు. బీజేపీ ఇచ్చిన మాట తప్పడం వల్లే ఎంవీఏ ఆవిర్భవించిందని, మహారాష్ట్ర ప్రజలు కూడా ఈ కూటమిని స్వాగతించారని పేర్కొన్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.

శివసేనకు సొంతంగా సీఎం అయ్యే అవకాశం మరోసారి వస్తుందని, అయితే అందుకు పార్టీకి క్షేత్రస్థాయిలో పునరజ్జీవం పోయాల్సిన అవసరం ఉందని థాక్రే అభిప్రాయపడ్డారు. తాను రాష్ట్రమంతా పర్యటించి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువ మందిని శివసేనలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసింది శివసేన. ఎన్నికల తర్వాత అనూహ్యంగా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రెండున్నరేళ్ల  తర్వాత ఏక్‌నాథ్ షిండే.. థాక్రేపై తిరుగుబావుటా ఎగురవేశారు. దాదాపు 40మంది రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని చీల్చి బీజేపీతో జట్టుకట్టారు. ఇటీవలే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు శివసేన పార్టీ తమదే అని థాక్రే, షిండే వర్గాలు న్యాయపోరాటానికి దిగాయి. ప్రస్తుతం దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.
చదవండి: పొలిటికల్‌ హీట్‌ పెంచిన షిండే ట్వీట్‌.. ఉద్ధవ్‌ థాక్రేతో స్నేహం!

మరిన్ని వార్తలు