Amit Shah-Uddhav Thackeray: అమిత్‌ షా సవాల్‌కి సై.. బీజేపీతో పొత్తుపై ‘మహా’ సీఎం సంచలన వ్యాఖ్యలు

24 Jan, 2022 09:14 IST|Sakshi

ముంబై: ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సవాలును స్వీకరిస్తున్నట్లు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాకరే చెప్పారు. పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ థాకరే జన్మదిన వేడుకల్లో ఆయన ఆదివారం పాల్గొన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉండడం వల్ల శివసేనకు 25 సంవత్సరాలు వృధాగా పోయాయనే ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు. మహారాష్ట్రకు బయటకూడా శివసేన కార్యకలాపాలను విస్తరిస్తామని, జాతీయస్థాయికి ఎదుగుతామని చెప్పారు.

బీజేపీ ఎదుగుదలలో సేనలాంటి పలు ప్రాంతీయ పార్టీల సహకారం ఉందని, ఆసమయంలో చాలాచోట్ల బీజేపీకి కనీసం డిపాజిట్లు వచ్చేవికాదని గుర్తు చేశారు. హిందుత్వకు అధికారమివ్వాలనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, అంతేకానీ అధికారం కోసం తామెప్పుడూ హిందుత్వను వాడుకోలేదని ఉద్దవ్‌ చెప్పారు. బీజేపీ అనుకూలవాద హిందుత్వ చేస్తుందని ఆయన విమర్శించారు. రాజకీయ అధికారం కోసమే బీజేపీ కాశ్మీర్‌లో పీడీపీతో, బీహార్‌లో జేడీయూతో పొత్తు పెట్టుకుందన్నారు. సేన, అకాలీదళ్‌ లాంటి పాత మిత్రులు పోవడంతో ఎన్‌డీఏ పరిధి తగ్గిందన్నారు.

ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో తమ పొత్తును ఆయన సమర్ధించుకున్నారు. బీజేపీ మిత్రపక్షాలను వాడుకొని వదిలేస్తుందన్నారు. తాము బీజేపీని వదిలేశాము కానీ హిందుత్వను కాదని చెప్పారు. ఎప్పటికైనా ఢిల్లీ గద్దెను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్‌సీపీలు బీజేపీలాగా కాదని, వ్యవస్థలను గౌరవిస్తాయని చెప్పారు. బాల్‌ ధాకరే జన్మదినోత్సవం రోజునే శివసేన ఆవిర్భవించింది. దీంతో పార్టీ, పార్టీ వ్యవస్థాపకుడి జన్మదిన వేడుకలను కలిపిజరుపుతారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని శివసైనికులకు ఉద్దవ్‌ పిలుపునిచ్చారు. ఇటీవలే ఉద్దవ్‌ వెనుముక సర్జరీ చేయించుకున్నారు. తన ఆరోగ్యంపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు.

మరిన్ని వార్తలు