మహారాష్ట్రలో పేర్ల మార్పు చిచ్చు

12 Jan, 2021 09:38 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో నగరాల పేర్ల మార్పు అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న మహావికాస్‌ ఆఘాడిలో కూడా పేర్ల మార్పు అంశం చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. ఔరంగాబాదు పేరును సంభాజీనగర్‌గా మార్చాలని శివసేన భావిస్తోంది. దీనిపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేరు మార్పునకు వ్యతిరేకత తెలిపింది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ పేరు మార్చే అంశాన్ని శివసేన తెరమీదికి తీసుకువచ్చిందని బీజేపీ ఆరోపిస్తోంది. అహ్మద్‌నగర్, పుణె నగరం పేర్లను కూడా మార్చాలన్న డిమాండు తాజాగా తెరపైకి వచ్చింది. అహ్మద్‌నగర్‌ పేరును అంబిక నగర్‌గా మార్చాలని షిర్డీ పార్లమెంటు సభ్యులు సదాశివ్‌ లోఖండేతో పాటు పలు హిందుత్వ సంస్థలు డిమాండు చేస్తున్నాయి. పుణె నగరం పేరును జీజావు పూర్‌గా మార్చాలని సంభాజీ బ్రిగేడ్‌ డిమాండ్‌ చేస్తోంది. చదవండి: చికెన్‌ లేదన్నాడని ఎంత పని చేశారు..

ఎమ్మెన్నెస్‌ ఆందోళన  
ఔరంగాబాదు పేరును సంభాజీనగర్‌గా మార్చాలని డిమాండు చేస్తూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్‌) నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. మూడు రోజులుగా నాసిక్, ఔరంగాబాద్, పాల్ఘర్‌లలో ఆందోళనలు చేపట్టింది. బస్సులపై ఔరంగాబాదు పేరు స్థానంలో ఛత్రపతి సంభాజీనగర్‌ బోర్డును ఏర్పాటు చేయడం ప్రారంభించింది. 

ఠాక్రే ప్రభుత్వానికి ముప్పు: సంజయ్‌ నిరుపమ్‌ 
ఔరంగాబాదు పేరును సంభాజీనగర్‌గా మార్చాలని పట్టుబడితే ఠాక్రే ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుందని కాంగ్రెస్‌ నాయకుడు సంజయ్‌ నిరుపమ్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది శివసేన ప్రభుత్వం కాదని, మూడు పార్టీల మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఇక ఔరంగాబాదు పేరు మార్పు శివసేన వ్యక్తిగత అజెండా అన్నారు. 

ఎన్నికల కోసమే: దేవేంద్ర ఫఢ్నవీస్‌
ఔరంగాబాద్‌ పేరు మార్పు అంశాన్ని ఎన్నికల కోసమే తెరపైకి తీసుకు వచ్చారని ప్రతిపక్ష బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆరోపించారు. ఎన్నికలు పూర్తి కాగానే ఈ విషయాన్ని మర్చిపోతారన్నారు. ఔరంగాబాదు పేరును మార్చే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రెవిన్యూ శాఖ మంత్రి బాలాసాహెబ్‌ థోరాత్‌ స్పష్టం చేశారు. పేరును మార్చినంత మాత్రాన ప్రజలకు ఒరిగేదేం లేదన్నారు. 

రాద్ధాంతం చేస్తున్నారు: అజిత్‌ పవార్‌ 
ఔరంగాబాదు పేరు మార్పు అంశంపై ఎన్సీపీ నేత ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ స్పందించారు. ఈ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ కూటమిలో విబేధాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు