‘కరోనా పురుగు దొరికితే మాజీ సీఎం నోట్లో వేస్తాను’

19 Apr, 2021 15:56 IST|Sakshi

శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబై: కరోనా విజృంభిస్తోన్న వేళ రెమిడెసివీర్‌ ఔషధానికి భారీ డిమాండ్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ముంబైలో రెమిడెసివీర్‌ డోసులను అక్రమంగా నిల్వ ఉంచాడనే ఆరోపణలపై పోలీసులు ప్రముఖ ఫార్మ కంపెనీ సీఈఓని అరెస్ట్‌ చేశారు. దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందించారు. ముంబై పోలీసులు అనవసరంగా సదరు ఫార్మ కంపెనీ సీఈఓని వేధిస్తున్నారన్నారు. ఫడ్నవీస్‌ వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపాయి. దీనిపై శివసేన, బీజేపీ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. 

ఈ క్రమంలో శివసేన ఎమ్మెల్యే ఒకరు ఫడ్నవీస్‌ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తనకు కనుక కరోనాకు కారణమైన క్రిమి దొరికితే వెంటనే దాన్ని తీసుకువచ్చి.. ఫడ్నవీస్‌ నోట్లో వేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివసేన ఎమ్మేల్యే సంజయ్‌ గైక్వాడ్‌ శనివారం రిపోర్టర్లతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కోవిడ్‌ విశ్వరూపం దాల్చింది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బీజేపీ.. మమ్మల్ని అప్రదిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవేళ నాకే గనుక కోవిడ్‌కు కారణమైన క్రిమి దొరికితే.. వెంటనే దాన్ని తీసుకువచ్చి ఫడ్నవీస్‌ నోట్లో వేస్తాను’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి విజృంభిస్తోన్న వేళ బీజేపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. 

అంతేకాక ‘‘కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు సరిపడా ఆక్సిజన్‌ని సరఫరా చేయడం లేదు. అదే సమయం‍లో ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం అయిన గుజరాత్‌కి మాత్రం ఉచితంగా 50 వేల డోసుల రెమిడెసివీర్‌ ఇంజక్షన్‌లను సరఫరా చేసింది. కానీ ఇక్కడ జనాలు చనిపోతున్నా పట్టించుకోవడం’’ లేదు అని సంజయ్‌ ఆరోపించారు. 

సంజయ్‌పై కేసు నమోదు
సంజయ్‌ గైక్వాడ్‌ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సంజయ్‌ గైక్వాడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన దిష్టి బొమ్మలు దగ్దం చేశారు. సంజయ్‌ తన వ్యాఖ్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ముంబై ప్రెసిడెంట్‌ ఎంపీ లోధా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

చదవండి: వచ్చే 15 రోజుల్లో యాక్టివ్‌ కేసులు రెట్టింపు

మరిన్ని వార్తలు