కొత్త పొద్దు పొడుస్తుంది: శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

8 Jan, 2022 03:07 IST|Sakshi

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది 

బీజేపీ అంటే బిర్యానీ కాదు... కేసీఆర్‌ పాలన అంతమొందించే దాకా విశ్రమించం 

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని, రాత్రి చీకట్లు తొలగి కొత్త సూర్యోదయం అవుతుందని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చెప్పారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అన్యాయంపై ధర్మయుద్ధంలో టీఆర్‌ఎస్‌ను ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ సంఘర్షణ పోరాటాన్ని ప్రకటించడానికే తాను ఇక్కడకు వచ్చానన్నారు. ఇటీవల అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అభినందన కార్యక్రమం శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన శివరాజ్‌సింగ్‌ మాట్లాడారు. 

ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారు 
సీఎం కేసీఆర్‌ భయకంపితులై ఉన్నారని, ఇంతగా భయపడే పిరికి సీఎంను తానెక్కడా చూడలేదని చౌహాన్‌ పేర్కొన్నారు. ‘ప్రజలు, ఉద్యోగులు, ప్రతిపక్షాలు, ఇతర వర్గాల ప్రజలు ఏవైనా సమస్యలు లేవనెత్తినప్పుడు ప్రభుత్వాలు సమాధానాలివ్వడం సంప్రదాయం. భయపడే వారే ప్రశ్నించే వారిని జైల్లో పెడతారు. అదే తెలంగాణలో జరుగుతోంది..’అని అన్నారు. ఇక్కడ సమస్యలపై ఉద్యమిస్తే భయపడి అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని విమర్శించారు. శ్రీకృష్ణుడు కూడా జైల్లోనే జన్మించి లోకకంఠకుడైన కంసుడిని అంతమొందించాడని, అదేవిధంగా ఇక్కడా కేసీఆర్‌ పాలన అంతమౌతుందని వ్యాఖ్యానించారు.  

కేసీఆర్‌ను ప్రజలే జైలుకు పంపిస్తారు 
బీజేపీ అంటే తినే బిర్యానీ కాదని, రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనను అంతమొందించే వరకు పార్టీ విశ్రమించే ప్రసక్తే లేదని శివరాజ్‌సింగ్‌ స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాలు, కేజీ టు పీజీ తదితర హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. వీటన్నింటిపై సమాధానాలు చెప్పకపోతే ప్రజలే కేసీఆర్‌ను జైలుకు పంపిస్తారన్నారు. ‘కేసీఆర్‌.. తెలంగాణ గడ్డపైకి వచ్చాను. నీ పాపాలు, రాక్షస పాలనను అంతమొందించడానికి, ఇక్కడ బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడానికే వచ్చాను..’అని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని ఆరోపించారు.  

మరిన్ని వార్తలు