గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ

4 Apr, 2021 15:18 IST|Sakshi

వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్ధి

సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. నందివాడ మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి దాసరి మేరీ విజయకుమారి.. మంత్రి కొడాలి నాని సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు. పరిషత్ ఎన్నికలు బహిష్కరించిన బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేరీ విజయ రాజీనామా చేశారు. ఆమెతో పాటుగా, పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వారికి మంత్రి కొడాలి నాని.. కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా  ఆహ్వానించారు.

ఆనాడు స్పందించని పవన్.. ఇప్పుడు మాట్లాడటం విడ్డూరం..
తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు. పూర్తి అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్ అని మంత్రి మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ వివేకా హత్య జరిగిందని.. ఆనాడు స్పందించని పవన్ ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ హయాంలోనే వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ప్రారంభమైంది. తండ్రి హత్య కేసుపై కుమార్తె సీబీఐని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.

‘‘పవన్ కల్యాణ్ ఎవరో రాసిచ్చిన డైలాగ్‌లు, స్క్రిప్ట్‌ను చదువుతున్నాడు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. విపక్షాలు మత విద్వేషాల ద్వారా లబ్ధి పొందేందుకే ప్రయత్నిస్తున్నాయి. దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గమని’’ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు.
చదవండి:
దేవుడే అస్త్రమా.. ఇదేం రాజకీయం..?
హిందూపురంలో బాలకృష్ణకు ఝలక్

మరిన్ని వార్తలు