దమ్ముంటే మొత్తం ఆడియో బయట పెట్టండి: పీకే

10 Apr, 2021 12:27 IST|Sakshi

టీఎంసీ ఎన్నికల  వ్యూహకర్త  ప్రశాంత్‌ కిశోర్‌ ఆడియో క్లిప్‌ కలకలం

ఖండించిన ప్రశాంత్‌  కిషోర్

నాలుగో దశ పోలింగ్‌ : కాల్పుల్లో నలుగురు మృతి

కోలకతా : పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్‌ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్‌కు సంబంధించిన ‘క్లబ్‌హౌస్ చాట్’ ఆడియో టేప్ ప్రకంపనలు రేపుతోంది. సోషల్ మీడియాలో టీఎంసీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, ఇదే మమత ఓటమికి కారణం కావొచ్చంటూ పీకే ఆడియోలో వెల్లడించినట్లుగా ఉందనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. అది అసలు తన ఆడియో కాదంటూ ట్విటర్‌ ద్వారా ఖండించారు. తమ పార్టీ నాయకుల మాటలకంటే, తన మాటలను బీజేపీ సీరియస్‌గా తీసుకోవడం ఆనందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు.  తమకనుకూలమైన  క్లిప్పింగులకు బదులుగా, ధైర్యం ఉంటే మొత్తం చాట్‌ను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు బీజేపీ100 సీట్ల మార్క్‌ను దాటబోదు అంటూ ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. 

బెంగాల్‌లో బీజేపీ ఓటమి తప్పదని గతంలో సవాల్‌ చేసిన ప్రశాంత్‌ కిషోర్‌ తాజాగా బీజేపీ గెలుస్తుందని ఆయన చెప్పినట్లుగా ఉన్న ఈ ఆడియోను పశ్చిమ బెంగాల్ బీజేపీ విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.  బీజేపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి అమిత్ మాల్వియా పోస్ట్‌ చేసిన ఒక క్లిప్‌ ప్రకారం గత సాయంత్రం జర్నలిస్టులతో జరిగిన చాట్‌లో మమతాపై వ్యతిరేకత, దళితుల ఓట్లు బీజేపీకి కలసి రానున్నాయని, ప్రధాని మోదీకి పాపులారీటీ బాగాపెరిగిందనీ, దీంతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. దీంతో బీజేపీ నేతలు తృణమూల్ గేమ్ ఓవర్ అంటూ సంబరాలు చేసు కుంటున్నారు.  మరోవైపు ఇదంతా బీజేపీ ఆడుతున్న డ్రామా అని టీఎంసీ మండిపడింది.

తాజా ఎన్నికల్లో బెంగాల్‌లో ఎలాగైనా  టీఎంసీకి చెక్‌ పెట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అధికార టీఎంసీ  పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి వందకు పైగా సీట్లు వస్తే..తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయనని, ఏ రాజకీయ పార్టీకి సలహాలు, సూచనలు ఇవ్వనని టీఎంసీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ గతంలో ప్రకటించారు. కాగా బెంగాల్ ఎన్నికలు మొత్తం 8 దశల్లో భాగంగా ప్రస్తుతం నాలుగో దశకు చేరుకున్నాయి. ఈ నెల 29వ తేదీతో ముగియనున్నాయి. ఫలితాలు మే 2న  రానున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు