ప్రజాస్వామ్యమా..? దాదాగిరా..?.

20 Dec, 2020 10:04 IST|Sakshi
చిట్యాలలో మాట్లాడుతున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

కేంద్రం ఓ పార్టీ జాగీరా..!

కొత్తచట్టాలతో సాగు తిరోగమనం

వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

సాక్షి, నిర్మల్ ‌: ‘పన్నులు కట్టేది ప్రజలు.. పదవులు ఇచ్చేది ప్రజలు. ఢిల్లీకి చేరే డబ్బు ట్రంప్, జిన్‌పింగ్‌ది కాదు. రాష్ట్రాల నుంచి ప్రజలు చెల్లించే పన్నులే. నిధులు తీసుకోవడం రాష్ట్రాల హక్కు. కేంద్రం ఒక్క పార్టీ జాగీరా..! నిధులిస్తున్నం ఫొటోలు పెట్టండని దబాయించడమేంది. కేంద్రంతో బాగుపడిన ఒక్క స్కీం కూడా లేదు. ఓ వైపు రాష్ట్రం వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తుంటే.. కేంద్రం కొత్త చట్టాలతో తిరోగమనం పట్టిస్తోంది. రాష్ట్రంలో మీరు చేస్తున్నది ప్రజాస్వామ్యమా..? దాదాగిరా..? సీఎంను, మంత్రులను ఏకవచనంతో పిలుస్తారా..? మీ స్థాయి ఎంత..? లెక్కెంత..?’ అంటూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరోక్షంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. నిర్మల్‌ జిల్లాలోని రూరల్‌ మండలం చిట్యాల, ఖానాపూర్‌ మండలం దిలావర్‌పూర్‌ గ్రామాల్లో అటవీశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రైతుబంధు రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి శనివారం రైతు వేదికలను ప్రారంభించారు. వ్యవసాయం పెరిగితేనే పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారాలు పెరుగుతాయని, పల్లెల్లో సాగు బాగుంటేనే పట్టణాల్లో వెలుగులు ఉంటాయని, రైతు సమస్యలకు ఆధునిక పరిష్కారాలు చూపుతూ.. రైతువేదికలను ప్రపంచానికే ఆదర్శంగా నిలబెడతామని తెలిపారు. చదవండి: మానవత్వం చాటుకున్న మంత్రి హరీశ్‌

వేదికల ద్వారా రైతుల ఇంటికే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారకాలు డోర్‌డెలివరీ చేస్తామన్నారు. వ్యవసాయ అభివృద్ధికి రైతుబంధు మొదలు ఉచిత విద్యుత్‌ వరకు రాష్ట్రం అందిస్తుంటే కేంద్రం మాత్రం రివర్స్‌గేర్‌లో పనిచేస్తోందని మండిపడ్డారు. మూడు కొత్త చట్టాలతో వ్యవసాయాన్ని బడావ్యాపారుల చేతుల్లో పెడుతోందని విమర్శించారు. భవిష్యత్తులో రైతులు నష్టపోవద్దనే రాష్ట్రం ఆ చట్టాలను వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్రంలో బండోడు, గుండోడు, చెండోడు జమయ్యారని, తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము ప్రధాని పీఠానికి విలువనిచ్చి మాట్లాడుతుంటే.. వాళ్లు మాత్రం సీఎం, మంత్రులను ఏకవచనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విమర్శిస్తున్న నేతలు కేంద్రంతో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలన్నారు. పది లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు కట్టారా..? పది లక్షల మందికి ఉపాధి ఇచ్చారా..? అన్ని ప్రశ్నించారు. రైతువేదికలకు నిధులిస్తున్నాం.. ఫొటోలను పెట్టాలని అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. దమ్ముంటే.. కేసీఆర్‌ సర్కార్‌ అమలు చేస్తున్న పథకాలను బీజేపీ పాలితరాష్ట్రాల్లో అమలు చేయాలని హితవు పలికారు. చదవండి: బిగ్‌బాస్‌: అతడికే ఓటు వేసిన హిమజ

ఊళ్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల తర్వాత స్నానాల కోసం కాసేపు కరెంటు వేయండని బతిమాలిన రోజుల నుంచి.. మిగులు విద్యుత్‌ వరకు ఎదిగామని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. రైతుబంధు రానివారు ఈనెల 20 వరకు నమోదు చేసుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్, ఇప్పుడు రైతువేదికలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ సర్కారుదేనని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. చిట్యాలకు వచ్చేముందు బీజేపీ నాయకులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతువేదికలపై ప్రధానమంత్రి, ఎంపీల ఫొటోలను పెట్టాలని నినాదాలు చేశారు. పోలీసుల అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో నిర్మల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, ముథోల్, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్, కలెక్టర్‌ ముషరఫ్‌అలీ ఫారూఖి, అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు