ఎన్నికల తర్వాతే ప్రత్యామ్నాయ ఫ్రంట్‌లు

10 Jan, 2022 09:17 IST|Sakshi

మతతత్వ బీజేపీని ఓడించడమే లక్ష్యం

సీఎం కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఎన్నికల తర్వాతే ప్రత్యామ్నాయ ఫ్రంట్‌లు ఏర్పడుతాయని చరిత్ర చెబుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్, 2004లో యూపీఏ, 1998లో ఎన్డీఏ వంటివన్నీ ఎన్నికల పూర్తయిన తర్వాత ఏర్పడినవేనని ఉదహరించారు. 1977లో ఇందిరాగాంధీ ఓడిన సమయంలో జనతా పార్టీ కూడా ఎన్నికల తర్వాతే ఏర్పడిందన్న విషయాన్ని గుర్తుచేశారు.

అందువల్ల ఎన్నికలకు ముందు ఎలాంటి ఫ్రంట్‌లు ఏర్పడాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం హైదరాబాద్‌లో ముగిశాయి. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఏచూరి మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ సమావేశాల్లో రాజకీయ ముసాయిదాను ఆమోదించాం. దీనిపై కార్యకర్తలు తమ అభిప్రాయాలను, సవరణలను నేరుగా కేంద్ర కమిటీకి పంపొచ్చు. ఆయా సవరణలను పార్టీ జాతీయ మహాసభల ముందుంచుతాం.

పార్టీ జాతీయ మహాసభలు ఏప్రిల్‌ 6 నుంచి 10 వరకు కేరళలోని కన్నూరులో జరపాలని నిర్ణయించాం. మా రాజకీయ ముసాయిదాలో ప్రధానంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పిలుపునిచ్చాం. ఈ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించాం. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోంది. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికి బీజేపీని ఓడించాల్సిన అవసరముంది, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఎత్తుగడలు రచిస్తాం’అని ఏచూరి చెప్పారు. 

ప్రజల్లో మోదీపై అసంతృప్తి
దేశ ప్రజల్లో బీజేపీ ప్రభుత్వంపైనా, ప్రధాని మోదీపైనా తీవ్ర వ్యతిరేకత ఉందని సీతారాం ఏచూరి అన్నారు. ‘ఆర్థిక సంక్షోభం పెరిగింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్నా, దేశంలో పెట్రో ఉత్పత్తులు నిరంతరం పెరుగుతున్నాయి. పేదరికం, నిరుద్యోగం, ఆకలి వంటి సమస్యలతో జనం తల్లడిల్లుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగానే ఓటేస్తారు.

ప్రధానమంత్రి సహా ఎవరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలి. ఎన్నికల విరాళాలను బాండ్ల రూపంలో తీసుకొచ్చి రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేశారు. ఎన్నికల బాండ్లలో 80 శాతం బీజేపీకే వెళ్తున్నాయి. ఈ డబ్బును బీజేపీ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఎన్నికల కమిషన్‌ దీన్ని అడ్డుకోవాలి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించగల సత్తా ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి మేము మద్దతు ఇస్తాం’అని ఏచూరి వివరించారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే కేసీఆర్‌కు స్వాగతం
బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌ పనిచేస్తే తాము స్వాగతిస్తామని ఏచూరి స్పష్టం చేశారు. అయితే ఎన్నికల్లో ఆయనతో కలిసి పనిచేస్తామా లేదా అన్నది ఇప్పుడు నిర్ణయించబోమని, ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులను బట్టి ఎత్తుగడలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామన్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా పరిస్థితులు ఉంటాయని, అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఎతుగడలు ఉంటాయని చెప్పారు. ఏదిఏమైనా బీజేపీని ఓడించడమే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. సీపీఐ, సీపీఎంల విలీనం ప్రతిపాదనేదీ రాలేదన్నారు.

బీజేపీపై సానుకూలంగానే టీఆర్‌ఎస్‌: తమ్మినేని
టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ‘బీజేపీని టీఆర్‌ఎస్‌ సూటిగా విమర్శించడంలేదు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలని టీఆర్‌ఎస్‌ చెప్పట్లేదు. రైతు సమస్యలు వంటి విషయాలు తప్పిస్తే ఇతరత్రా బీజేపీ పట్ల టీఆర్‌ఎస్‌ ఇంకా సానుకూల వైఖరితోనే ఉంది. రాష్ట్రంలో బీజేపీ ప్రమాదకరంగా ఎదుగుతోంది. దాన్ని ఒంటరి చేయాల్సిన అవసరం ఉంది’అని తమ్మినేని చెప్పారు.

మరిన్ని వార్తలు