బీఎస్పీకి ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై! 

29 Oct, 2020 09:21 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ప్రతిపక్ష బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)లో మంటలు రాజేస్తున్నాయి. ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటు ప్రారంభించారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరబోతున్నామంటూ సంకేతాలిచ్చారు. యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు నవంబర్‌ 9న ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో తన బలం దృష్ట్యా బీఎస్పీ తన అభ్యర్థిగా రామ్‌జీ గౌతమ్‌ను రంగంలోకి దింపింది. ఆయన పేరును 10 మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఈ మేరకు నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేశారు. అయితే తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి తాము మద్దతు ఇవ్వబోమని ఆరుగురు ఎమ్మెల్యేలు బుధవారం తేల్చిచెప్పారు. పార్టీ అధినేత మాయావతిపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని వారు స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ప్రకాశ్‌ బజాజ్‌ అనే పారిశ్రామికవేత్త స్వతంత్ర అభ్యర్థిగా చివరి నిమిషంలో పోటీకి దిగారని, ఆయనను గెలిపించేందుకు తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కొనేశారని బీఎస్పీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే ఉమాశంకర్‌ సింగ్‌ ఆరోపించారు.  

మరిన్ని వార్తలు