కేంద్రం యూటర్న్‌ : ఏప్రిల్‌ ఫూల్‌ జోకా?

1 Apr, 2021 12:11 IST|Sakshi

చిన్నమొత్తాలపొదుపు వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం

పొరపాటున ఆదేశాలిచ్చాం : ఆర్తికమంత్రి నిర్మలా సీతారామన్‌

సాక్షి, న్యూఢిల్లీ: పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీలాంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. చిన్నమొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గిస్తున్నట్లు  ప్రకటించిన  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెంటనే ఈ నిర్టయాన్ని వెనక్కి  తీసుకుంది. వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని కేంద్ర స్పష్టం చేసింది. ఈ మేరకు వడ్డీరేటు తగ్గింపు ఆదేశాలను ఉపసంహరించుకున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం ట్వీట్ చేశారు. 2020-2021 చివరి త్రైమాసికం రేట్లే యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.   

అయితే పొరబాటున వడ్డీరేట్ల తగ్గింపు ఉత్తర్వులిచ్చామన‍్న ఆర్థికమంత్రి వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం చూపుతుందని భయంతోనే కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుందనే విమర్శలు వెల్లువెత్తాయి. చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టే దేశీయ మధ్య తరగతి ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఫూల్ జోక్‌తో ఆడుకుంటోందంటూ టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రెయిన్ ట్విటర్‌లో మండిపడ్డారు. నిజంగానే పొరబాటున తగ్గింపు ఆదేశాలిచ్చారా..లేక ఎన్నికల జిమ్మిక్కా అంటూ సీతారామన్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. అటు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేక సర్కస్‌ చేస్తున్నారా  అంటూ  మరో కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా  ఆర్థికమంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన కేంద్రం సమీక్షిస్తుంది.  ఈనేపథ్యంలోనే వడ్డీ రేట్లను 40-110 బేసిస్ పాయింట్ల మధ్య కోత విధించినట్లు ఆర్థికశాఖ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజా నిర్ణయంతో  ప్రస్తుతానికి ఈ కోత లేనట్టే. దీని ప్రకారం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు 7.1 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 6.8 శాతం, సుకన్య సమృద్ధి యోజన పథకంపై వడ్డీ రేటు7.6 శాతంగా యథాతథంగా అమలుకానుంది. 

మరిన్ని వార్తలు