రాజకీయాలు కాకుంటే.. మళ్లీ ఎందుకు?

3 Oct, 2020 15:17 IST|Sakshi

లక్నో: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి హథ్రాస్‌ ఘటన నిరసనల సెగ తగిలింది. వారణాసి వచ్చిన ఇరానీని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమె కారును చుట్టుమట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాధితురాలికి న్యాయం చేయాలని, రాహుల్ గాంధీ‌, ప్రియాంక గాంధీ హథ్రాస్‌ పర్యటనకు అనుమతినివ్వాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, రాహుల్‌, ప్రియాంక మరోసారి హథ్రాస్‌ పర్యటనకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో యూపీ డీజీపీ, ఉన్నతాధికారులు సైతం హథ్రాస్‌ బయల్దేరి వెళ్లారు. నొయిడా టోల్‌ ప్లాజా ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. 
(చదవండి: సంచలనంగా మారిన ఆడియో క్లిప్‌లు..)

రాజకీయాలు ఇక చాలు
హథ్రాస్‌ ఘటన బాధిత కుటుంబానికి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం న్యాయం చేస్తుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. రాహుల్‌, ప్రియాంక హథ్రాస్‌ పర్యటనపై ఆమె మండిపడ్డారు. రాజస్తాన్‌ అత్యాచారాల విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఎదురుదాడికి దిగారు. రాజస్తాన్‌ ఘటనలపై సీఎం అశోక్‌ గహ్లోత్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. హథ్రాస్‌ ఘటన విషయంలో రాహుల్‌, ప్రియాంక ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టి లాభం పొందేందుకే వారిద్దరూ మళ్లీ హథ్రాస్‌ పర్యటన పెట్టుకున్నారని  ఆరోపించారు. కాగా, హథ్రాస్‌కు బయల్దేరిన రాహుల్‌ గాంధీ, ప్రియాంకను పోలీసులు గురువారం అడ్డుకున్న సంగతి తెలిసిందే. లాఠీచార్జిలో రాహుల్‌ కిందపడటంతో దేశవ్యాప్తంగా యోగి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తమైంది. శుక్రవారం కూడా అలాంటి ఘటనే జరిగింది. తృణమూల్‌ నేతలపైనా హథ్రాస్‌ సరిహద్దుల్లో లాఠీచార్జ్‌ జరిగింది.


కాగా, హథ్రాస్‌ గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్‌ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హతమార్చారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత మంగళవారం ఆమె మరణించింది. ఇక బాధితురాలి కుటుంబానికి మద్దతుగా ర్యాలీ జరగుతున్న క్రమంలోనే అదే అర్ధరాత్రి పోలీసులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఫోరెన్సిక్‌ నివేదిక బాధితురాలిపై అత్యాచారం జరగలేదని వెల్లడించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈకేసులో మొత్తం రికార్డులు బహిర్గతం చేయాలని ప్రియాంక గాంధీ డిమాండ్‌ చేశారు. హథ్రాస్‌ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
(చదవండి: నిందితులతో పాటు బాధితులకు లై డిటెక్టర్‌ టెస్ట్‌: సిట్‌)

మరిన్ని వార్తలు