మునుగోడు పాలి‘ట్రిక్స్‌’లో స్పీడ్‌ పెంచిన నేతలు.. ప్రచారంలో కొత్త స్టైల్‌!

19 Oct, 2022 11:31 IST|Sakshi

ఉపఎన్నిక ప్రచారంలో రాజకీయ పార్టీల సోషల్‌మీడియా బాట

ఇప్పటికే ఓటర్ల నంబర్లను సేకరించిన ప్రధాన పార్టీలు

ఫేస్‌బుక్, వాట్సాప్‌లో ప్రచార     సందేశాలు 

బల్క్‌పోస్టింగ్‌లతో దూసుకుపోతున్న నేతలు

తమ అభిప్రాయాలను కూడా ముక్కుసూటిగా చెప్పేస్తున్న ఓటర్లు  

సాక్షి, యాదాద్రి : మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తుండడంతో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అభ్యర్థులు తమ బలాబలాలను చెప్పుకుంటూనే ప్రత్యర్థుల బలహీనతలను తమ ప్రచారంలో ఏకరువు పెడుతున్నారు. గ్రామాల వారీగా క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లతో టీఆర్‌ఎస్, ఇన్‌చార్‌్జలతో బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల మైకుల హోరు, కరపత్రాల పంపిణీ ఏ అంశాన్ని వదలకుండా ప్రచారంలో దూçసుకుపోతున్నారు. దీనికి తోడు సెల్‌ఫోన్, కంప్యూటర్‌కు అతుక్కునే యువత, మహిళలు, ఉద్యోగ వ్యాపారాలతో బిజీగా ఉండే వారిని ఓటు అడగడానికి ఆయా పార్టీల అభ్యర్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఓట్లను రాబట్టుకునేందుకు సోషల్‌మీడియాను ఎంచుకుంటున్నారు. 

స్మార్ట్‌ ఫోన్‌లలో సందేశాలు
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే సభలు, సమావేశాలు, ర్యాలీలు, కరపత్రాల పంపిణీతో ఊళ్లల్లో హోరెత్తిపోయేవి. కానీ నేడు సోషల్‌మీడియా పుణ్యమా అని రాజకీయ పార్టీల నాయకులు నేరుగా ఓటర్లతో వాట్సాప్, ఫేస్‌బుక్‌ ద్వారా నిత్యం అనుసంధానంలో ఉంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో 2,41,367 మంది ఓటర్లు ఉంటారు. వీరిలో కనీసం లక్షన్నరకుపైగానే స్మార్ట్‌ఫోన్‌ ఉన్న వారు ఉంటారు. వీరి నంబర్లను ఆయా పార్టీలు సేకరించాయి. తమ అభ్యర్థి, పార్టీ గుర్తు, గెలిపిస్తే చేసే సేవలు, అభివృద్ధి పనులు వగైరా వంటి వాటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు బల్క్‌ పోస్టింగ్‌లను అభ్యర్థుల తరపున ఓటర్ల ఫోన్‌లకు పంపిస్తున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుకుంటున్నాయి. 

టెలీకాన్ఫరెన్స్‌లో సమావేశాలు 
అభ్యర్థుల విజయం కోసం పార్టీలు టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నాయి. ఒకేసారి వందల మందితో సమావేశాలు నిర్వహించి సమాచారాన్ని చేరవేస్తున్నారు. సమాచార విస్తరణకు సులభంగా జరుగుతున్న సోషల్‌ మీడియా గ్రూపులు కూడా ఉప ఎన్నికల్లో తారాస్థాయిలో పనిచేస్తున్నాయి. 

అన్ని ప్రచారాలు లైవ్‌లో..
సోషల్‌ మీడియా ఎంతవేగంగా దూసుకుపోతుందంటే టీవీలో వచ్చే సమయానికంటే ముందుగానే లైవ్‌లో వచ్చేస్తోంది. ఉన్నది ఉన్నట్లుగా లైవ్‌లో చూపిస్తున్నారు. అభ్యర్థుల ర్యాలీలు, ప్రసంగాలు, చర్చలు, నామినేషన్లు ఇలా ప్రతి ఒక్కటి లైవ్‌లో ప్రసారం చేస్తున్నారు. వీటికి వేల నుంచి లక్షల్లో లైక్‌లు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఓటర్లు కూడా కామెంట్‌ పెట్టి తమ అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పేస్తున్నారు. కొన్నిసార్లు నెటిజన్లు అభ్యర్థుల తప్పిదాలను ఎండగడుతున్నారు. 

వాట్సాప్‌ నంబర్ల సేకరణ
స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ఓటర్ల వాట్సాప్‌ నంబర్లను సేకరించారు. ప్రధాన పార్టీల వద్ద సుమారు నియోజకవర్గం మొత్తంలో మండలాలు, గ్రామాల వారీగా ఈ నంబర్లు సేకరించారు. ఓ ప్రధాన పార్టీ 80 వేల వాట్సాప్‌ నంబర్లు సేకరిస్తే మరో పార్టీ లక్షకు పైగా వాట్సాప్‌ నంబర్లు సేకరించింది. దీంతోపాటు గ్రామ, వార్డు స్థాయి, కుల సంఘాలు, యువజన సంఘాలు, పరపతి సంఘాలు, మహిళా సంఘాలు ఇలా పలు రకాల వాట్సాప్‌ గ్రూపులు, దీంతోపాటు బ్రాడ్‌కాస్ట్‌ గ్రూపులకు ఒకే సారి మెసేజ్‌లు పంపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు