మూడు ప్రాంతాల సమానాభివృద్ధే బీజేపీ లక్ష్యం

23 Sep, 2020 04:32 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న సోము వీర్రాజు. చిత్రంలో బీజేపీ నేతలు కన్నా, పురంధేశ్వరి తదితరులు

రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో సోము వీర్రాజు

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమాన అభివృద్ధితో కూడిన సమృద్ధ్‌ ఆంధ్రానే బీజేపీ విధానమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. విజయవాడలో మంగళవారం జరిగిన పార్టీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 

► రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తూ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం పార్టీ నేతలందరూ పని చేయాలి. 
► జాతీయ స్థాయిలో మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ సమృద్‌ భారత్‌ పేరుతో దేశంలో మలివిడత అభివృద్ధికి పునాది వేశారు. అదే రీతిలో బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ సమృద్‌ ఆంధ్రా నినాదంతో ముందుకు సాగుతుంది. 
► బీజేపీకి కార్యకర్తలే బలం. వారి ద్వారా కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 
► ఆలయాలపై జరుగుతున్న ఘటనలపై బీజేపీ తుదకంటా పోరాటం చేస్తుంది.
 
మూడు తీర్మానాల ఆమోదం  

► రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, దేశంలో రైతులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకరావడం, రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై మూడు తీర్మానాలు చేశామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలల్లో పార్టీ బూత్, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేసి, జిల్లా ఇన్‌చార్జిల నియామకం చేపడతామన్నారు.  తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో జనసేనతో కలిసి పార్టీ అభ్యర్థిని పోటీలో దించాలని సమావేశంలో నిర్ణయించారు.  

మరిన్ని వార్తలు