సమర్థంగా ప్రతిపక్ష పాత్ర 

22 May, 2021 04:19 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

సాక్షి, అమరావతి : బడ్జెట్‌ సమావేశాలను టీడీపీ బాయికాట్‌ చేసినా తాము పాల్గొని ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, బడ్జెట్‌పై సోము వీర్రాజు వీడియో సందేశాన్ని పార్టీ శుక్రవారం మీడియాకు విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్న తీరుపై సీఎం సమీక్ష నిర్వహించాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో పేర్కొన్న కేటాయింపులతో పాటు గవర్నర్‌ ప్రసంగంలో చోటు కల్పించిన అంశాలపై తాము శాసన మండలిలో తీవ్రంగా వ్యతిరేకించినట్టు  చెప్పారు. కరోనా కట్టడితో పాటు రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్‌ సరఫరాకు తక్షణమే రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు నిధుల కేటాయింపు జరగలేదన్నారు. రాష్ట్రంలో ఓడరేవులు, పోర్టులపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని సోము వీర్రాజు విమర్శించారు.  

ఈ ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదు : ఎమ్మెల్సీ మాధవ్‌ 
రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. సంపూర్ణ మద్య నిషేధం అన్న జగన్‌.. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. కోవిడ్‌ పరీక్షల విషయంలోనూ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, వ్యాక్సిన్‌ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు.   

మరిన్ని వార్తలు