జీవో 77ను రద్దు చేయాలి: సోము వీర్రాజు

31 Dec, 2020 06:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రైవేట్‌ కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై బుధవారం ఆయన సీఎం వైఎస్‌ జగన్‌కి లేఖ రాసినట్లు ఆ పార్టీ మీడియాకు ప్రకటన విడుదల చేసింది. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు యూనివర్సిటీలు, ప్రభుత్వ పీజీ కాలేజీల విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వం జీవో 77లో పేర్కొందని లేఖలో ప్రస్తావించారు.

ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులు నష్టపోతారని, తక్షణం జీవోను రద్దు చేసి విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌ను రూ.2,139.44 కోట్లతో అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంపై సోము వీర్రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.   

మరిన్ని వార్తలు