పరిమితులకు లోబడే ‘సీమ’కు నీరు

6 Oct, 2020 04:17 IST|Sakshi

అపెక్స్‌ కమిటీ భేటీ సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ మీడియా ప్రకటన

రాయలసీమకు నీటి తరలింపునకు మద్దతుగా కేంద్రానికి సోము వీర్రాజు లేఖ

సాక్షి, అమరావతి: పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి రాయలసీమకు నీటి సరఫరా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిమితులకు లోబడి వ్యవహరిస్తుందని బీజేపీ రాష్ట్ర శాఖ పేర్కొంది. మంగళవారం కేంద్ర మంత్రి సమక్షంలో అపెక్స్‌ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రాజకీయ లబ్ధి కోసం కేంద్రంపై చేసే విమర్శలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్‌ చేసింది. అపెక్స్‌ కమిటీ మీటింగ్‌లో రాయలసీమ అంశంతో పాటు కృష్ణా, గోదావరి నదులపై పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీటుగా స్పందించాలని కోరింది. రాయలసీమ ప్రాంతానికి న్యాయబద్ధంగా నీటి కేటాయింపులు జరగాలని, అందుకు కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సహకారాన్ని కోరుతున్నామని తెలిపింది. రాష్ట్రాల అభివృద్ధి తప్ప ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉండరాదని, రాష్ట్రాల్లో వ్యతిరేక భావనలు పెంచడం బీజేపీ విధానం కాదని చెప్పింది. 

కేంద్ర మంత్రికి సోము వీర్రాజు లేఖ
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో సానుకూలంగా వ్యవహరించిన తీరులోనే అపెక్స్‌ కమిటీ భేటీలో రాయలసీమకు నీటి తరలింపు అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు మద్దతివ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు లేఖ రాశారు. రెండు రాష్ట్రాలకు నష్టం జరగకుండా నీటి కేటాయింపులు జరపాలని లేఖలో పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు