రాజ్యసభ ఎన్నికలు: నామినేషన్‌ వేసిన సోనియా గాంధీ.. కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన

14 Feb, 2024 13:56 IST|Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ(77) రాజ్యసభకు నామినేషన్‌ వేశారు. ఆ సమయంలో ఆమె వెంట కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తనయుడు రాహుల్‌ గాంధీ, తనయ ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు.  

అదే సమయంలో.. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ విడుదల చేసింది. సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక బిహార్‌ నుంచి అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి అభిషేక్‌ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్‌ హండోరె పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకొన్నట్లు కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటన జారీ చేశారు. 

రాజస్థాన్‌ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. అందులో ఒకటి కాంగ్రెస్‌కు దక్కనుంది. నెహ్రూ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే రెండో నేతగా సోనియా నిలవబోతున్నారు. 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.

ప్రస్తుతం సోనియా ఆమె రాయ్‌ బరేలీ లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే.. మొత్తం లోక్‌సభకు ఐదుసార్లు సోనియా గాంధీ ఎన్నికయ్యారు. రాబోయే ఎన్నికల్లో రాయ్‌ బరేలీ నుంచి ఆమె తనయ ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయబోతున్నారనే ప్రచారం నడుమ.. ఆమె రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడం గమనార్హం. వయసురిత్యా.. అలాగే అనారోగ్య కారణాలతోనే ఆమె పార్టీ కార్యకలాపాలకు(ఎన్నికల ప్రచారంతో సహా) దూరంగా ఉంటూ వస్తున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega