మహిళా బిల్లుపై సోనియా గాంధీ భావోద్వేగపు వ్యాఖ్యలు

20 Sep, 2023 11:46 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: నూతన పార్లమెంట్‌ భవన్‌లో ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. బిల్లుపై చర్యలో భాగంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ చర్చను ప్రారంభించారు. ఈ సందర్బంగా లోక్‌సభలో సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

సోనియా గాంధీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుంది. ఇది నా జీవితంలో కూడా భావోద్వేగంతో ముడిపడిన క్షణాలు. వంటింటి నుంచి ప్రపంచ వేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉంది. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడు ఆలోచించరు. స్త్రీల త్యాగాలు ఎనలేనివి. ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి స్త్రీలు పోరాడారు. సరోజినీ నాయుడు, సుచేత కృపాలనీ, ఆరుణాసఫ్‌ అలీ, విజయలక్ష్మీ పండిట్‌ వంటి వారెందరో దేశం కోసం పోరాడారు. 

ఈ బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాం. మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజీవ్‌ గాంధీ కల. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేందుకు తొలిసారిగా రాజ్యాంగ సవరణ చేస్తూ రాజీవ్ గాంధీ బిల్లును తీసుకొచ్చారు. రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత పీఎం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించింది. ఫలితంగా స్థానిక సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నేతలు ఎన్నికయ్యారు. దీంతో, రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయింది. ఈ బిల్లు ఆమోదంతో అది పూర్తవుతుంది.


గతంలో బీజేపీ సభ్యులు మహిళా బిల్లును అడ్డుకున్నారు. ఈ బిల్లును కాంగ్రెస్‌ పార్టీ సమర్థిస్తుంది. కానీ, బీజేపీ తెస్తున్న బిల్లులో కొన్ని భయాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 13 ఏళ్లుగా మహిళలు బిల్లు అమలు కోసం వేచిచూస్తున్నారు. ఇంకెన్నాళ్లు మహిళలు వేచిచూడాలి. వెంటనే కులగణన చేసి మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలి.  SC, ST మరియు OBC రిజర్వేషన్లపై కూడా నిర్ణయం తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఇది కూడా చదవండి: జనగణన లేకుండా బిల్లు పెట్టి ఏం చేస్తారు? 

మరిన్ని వార్తలు